డబ్బులివ్వలేదో ఆ ఫొటోలు నెట్‌లో పెడతా!

నకిలీ అశ్లీల ఫొటోలను సృష్టించి దాదాపు 100 మంది మహిళల్ని బెదిరించిన యువకుడిని దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. దక్షిణ దిల్లీలో ఓ మహిళ నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించి పోలీసులకు అడ్డంగా  దొరికిపోయాడు. అసభ్యకరంగా ఉన్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెడతానంటూ .......

Published : 31 Dec 2020 01:43 IST

ఫేక్‌ ఫొటోలతో 100 మహిళల్ని బ్లాక్‌మెయిల్‌ 
నిందితుడిని అరెస్టు చేసిన దిల్లీ పోలీసులు 

దిల్లీ: నకిలీ అశ్లీల ఫొటోలను సృష్టించి దాదాపు 100 మంది మహిళల్ని బెదిరించిన యువకుడిని దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. దక్షిణ దిల్లీలో ఓ మహిళ నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించి పోలీసులకు అడ్డంగా  దొరికిపోయాడు. అసభ్యకరంగా ఉన్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెడతానంటూ ఆమెను బెదిరించి డబ్బు కాజేసేందుకు ప్రయత్నించడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు సమగ్ర దర్యాప్తు జరిపి నిందితుడిని అరెస్టు చేశారు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 26 ఏళ్ల సుమిత్‌ ఝా అనే నిందితుడు ఇలాంటి తరహా కేసుల్లోనే గతంలో ఛత్తీస్‌గఢ్‌లో అరెస్టయ్యాడు. గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన నిందితుడు ఫిషింగ్‌ టెక్నిక్స్‌ నేర్చుకున్నాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నోయిడాలో ఉంటున్న సుమిత్‌.. తన నేరాన్ని అంగీకరించాడన్నారు. నిందితుడి నుంచి మొబైల్‌ ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.

 మార్ఫింగ్‌ చేసి.. బ్లాక్‌మెయిల్‌!
నిందితుడు తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను హ్యాక్‌ చేశాడని, డబ్బులు ఇవ్వకపోతే అతడి వద్ద ఉన్న నగ్న చిత్రాలను బయటపెడతానంటూ బెదిరించినట్టు పోలీసులకు ఓ మహిళ ఫిర్యాదు చేసింది. తన కాంటాక్ట్‌ లిస్ట్‌లో ఉన్నవారిని కూడా బెదిరించి డబ్బులు డిమాండ్‌ చేశాడని పేర్కొంది. ఆమె ఫిర్యాదు ఆధారంగా అతడిపై దోపిడీ, లైంగిక వేధింపులు, క్రిమినల్ చర్యల కేసులను నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని పట్టుకొనేందుకు గాలింపు ముమ్మరం చేశారు. సాంకేతిక వివరాలను ఇన్‌స్టా నుంచి తీసుకొని ట్రాక్‌ చేసి పట్టుకున్నారు. మహిళల్ని బ్లాక్‌మెయిల్‌ చేసి డబ్బులు దోచుకొనేందుకు నిందితుడు వారి సామాజిక మాధ్యమాల్లోని ప్రొఫైల్‌ ఫొటోలను తీసుకొనేవాడని, వాటిని మార్ఫింగ్‌ చేసి నకిలీ ప్రొఫైల్స్‌ సృష్టించేవాడని పోలీసులు వివరించారు. టార్గెట్‌ చేసుకున్న వారికి నగ్న చిత్రాలు తన వద్ద ఉన్నాయని సందేశం పంపేవాడని, ఆధారాలుచూపమని ఎవరైనా అడిగితే.. తన వద్ద మార్ఫింగ్‌ చేసిన ఫొటోలను వారికి పంపి భయపెట్టేవాడని తెలిపారు. 

అలాంటి కాల్స్‌కు దూరంగా ఉండండి: డీసీపీ
నిందితుడిని పట్టుకున్న దక్షిణ దిల్లీ పోలీసులకు సైబర్‌ క్రైం డీసీపీ అభినందనలు తెలిపారు. అపరిచితుల నుంచి వచ్చే వీడియో కాల్స్‌కు దూరంగా ఉండాలన్నారు. మీ వీడియోను నేరస్థులు స్క్రీన్‌ రికార్డు చేసి, ఆ తర్వాత దాన్ని ఎడిట్‌ చేసి దోపిడీకి పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. మీకు వ్యక్తిగతంగా తెలియని వారి నుంచి వచ్చే ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లను అమోదించవద్దన్నారు.

ఇదీ చదవండి..

చైనాలోని ఆ గుహ.. ఇప్పుడో కృష్ణబిలం!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని