రీఛార్జ్‌ అంటూ వచ్చి వైద్యురాలి దారుణ హత్య

సెట్‌ ఆఫ్‌ బాక్స్‌కు రీఛార్జ్‌ చేస్తానంటూ వచ్చిన తెలిసిన వ్యక్తి ఓ వైద్యురాలిని అత్యంత దారుణంగా హతమార్చాడు. అనంతరం ఆమె సంతానంపై దాడి చేశాడు....

Updated : 22 Nov 2020 05:37 IST

ఆమె సంతానంపైనా దాడి చేసిన నిందితుడు

ఆగ్రా: సెట్‌ ఆఫ్‌ బాక్స్‌కు రీఛార్జ్‌ చేస్తానంటూ వచ్చిన తెలిసిన వ్యక్తి ఓ వైద్యురాలిని అత్యంత దారుణంగా హతమార్చాడు. అనంతరం ఆమె సంతానంపై దాడి చేశాడు. ఈ భయానక ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో చోటుచేసుకుంది. కమలానగర్‌లో నివాసముంటున్న వైద్యురాలు నిషా సింఘాల్‌‌ ఇంటికి వెళ్లిన శుభమ్‌ అనే యువకుడు సెట్‌ ఆఫ్‌ బాక్స్‌కు రీఛార్జ్‌ చేసి అనంతరం నిషాపై కత్తితో దాడిచేశాడు. ఆమె గొంతు కోసి అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన సమయంలో ఆమె ఇద్దరు పిల్లలు వేరే గదిలో ఉన్నారు. వైద్యురాలిని హత్య చేసి చిన్నారుల గదికి వెళ్లిన యువకుడు వారిపై కూడా కత్తితో దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఇంట్లోని బంగారం, డబ్బుతో ఉడాయించాడు. విషయం తెలుసుకున్న వైద్యురాలి భర్త, వైద్యుడిగా విధులు నిర్వర్తిస్తున్న డా.అజయ్‌ సింఘాల్‌ ఇంటికి చేరుకొని భార్యతోపాటు పిల్లలను ఆసుపత్రికి తరలించాడు. కానీ నిషా సింఘాల్ అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. పిల్లలకు చికిత్స అందిస్తున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు వైద్యుల ఇంటికి చేరుకుని సీసీ పుటేజీని పరిశీలించారు. దాని ఆధారంగా నిందితుడిని గుర్తించారు. ద్విచక్రవాహనంపై పారిపోతున్న నిందితుడు శుభమ్‌ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అతడు పోలీసులపై కాల్పులకు తెగబడ్డాడు. అనంతరం పోలీసులు ఎదురు కాల్పులు జరపగా నిందితుడికి గాయాలయ్యాయి. అనంతరం అతడిని అదుపులోకి తీసుకొని ఆసుపత్రికి తరలించారు. వైద్యురాలి ఇంట్లో దొంగతనం చేసేందుకే శుభమ్‌ ఆమెను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధరించారు. వారి ఇంట్లో చోరీ చేసిన డబ్బు, బంగారం ఉన్న బ్యాగును నిందితుడి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని