మంగళగిరి పోలీస్‌స్టేషన్‌ వద్ద స్వల్పఉద్రిక్తత

గుంటూరు జిల్లా మంగళగిరి గ్రామీణ పోలీసుస్టేషన్‌ వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Published : 26 Oct 2020 00:39 IST

మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి గ్రామీణ పోలీసుస్టేషన్‌ వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈనెల 23న కృష్ణాయపాలెం వద్ద మూడు రాజధానులకు మద్దతుగా ఆటోలో వెళ్తున్న కొంత మంది ఎస్సీలను అదే గ్రామానికి చెందిన ఎస్సీలు, బీసీలు అడ్డగించారు. తామంతా రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చి రోడ్డున పడితే ఇదే మండలానికి చెందిన మీరంతా మూడు రాజధానులకు మద్దతుగా దీక్షలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దీనిపై ఆగ్రహించిన కొంత మంది ఎస్సీలు కృష్ణాయపాలెంకు చెందిన 11మంది ఎస్సీ, బీసీలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. 

గ్రామస్తులపై ఫిర్యాదు చేసిన వ్యక్తి కేసును వెనక్కి తీసుకునేందుకు సమ్మతించినా పోలీసులు తిరస్కరించారు. ఎఫ్ఐఆర్  నమోదైన నేపథ్యంలో కేసును వెనక్కి తీసుకున్నా.. అరెస్ట్ చేసిన వారిని వదిలిపెట్టబోమని, న్యాయమూర్తి ముందు హాజరు పరుస్తామని పోలీసులు స్పష్టం చేశారు. కేసుపెట్టిన 24 గంటలు కాకముందే పూర్తిస్థాయి విచారణ చేపట్టకుండా హడావుడిగా ఎఫ్ఐఆర్ ఎలా నమోదు చేస్తారని ఎస్సీ నేతలు, తెదేపా నాయకులు పోలీసులను నిలదీశారు. ఈ క్రమంలో బయటకు వచ్చిన డీఎస్పీ దుర్గాప్రసాద్ వాహనాన్ని ఎస్సీ నేతలు చుట్టుముట్టారు. తమకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ అంబేడ్కర్ కూడలి వద్ద ఆందోళనకు దిగారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఎస్సీ నేతలు స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని