యూట్యూబర్‌పై బాబా కా దాబా యజమాని ఫిర్యాదు

తన దాబా పాపులర్‌ అవడానికి కారణమైన యూట్యూబర్‌పై బాబా కా దాబా యజమాని కాంతప్రసాద్‌ (80) పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాబా సంక్షేమానికి వచ్చిన విరాళాలను గౌరవ్‌ వాసన్‌ దుర్వినియోగం చేశాడంటూ..

Published : 03 Nov 2020 00:57 IST

విరాళాలను దుర్వినియోగం చేశాడని వెల్లడి

దిల్లీ: తన దాబా పాపులర్‌ అవడానికి కారణమైన యూట్యూబర్‌పై బాబా కా దాబా యజమాని కాంతప్రసాద్‌ (80) పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాబా సంక్షేమానికి వచ్చిన విరాళాలను గౌరవ్‌ వాసన్‌ దుర్వినియోగం చేశాడంటూ పేర్కొన్నారు. దక్షిణ దిల్లీలో బాబా కా దాబా పేరుతో ఓ వృద్ధ దంపతులు నడిపిస్తున్న హోటల్‌ లాక్‌డౌన్‌ కారణంగా పూర్తిగా దివాలా తీసింది. దీంతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.  గత నెలలో ఆ దాబాకు వెళ్లిన గౌరవ్‌ వాసన్‌ అనే వ్యక్తికి తమ గోడును వెల్లగక్కారు ఆ దంపతులు. తమ పరిస్థితిపై కన్నీరు మున్నీరయ్యారు.

ఆ దృశ్యాన్ని వీడియో తీసిన సదరు యూట్యూబర్‌ వారికి మద్దతుగా నిలవాలంటూ ఆ వీడియోని సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు. విరాళాలు అందించి వారిని ఆదుకోవాలని కోరాడు. కాగా ఆ వీడియో విపరీతంగా పాపులర్‌ అయింది. పలువురు ప్రముఖులు, బాలీవుడ్‌ నటులు ఆ వీడియోని షేర్‌ చేశారు. దయచేసి ఆ హోటల్‌లో భోజనం చేసి ఆ దంపతులకు మద్దతుగా నిలవండి అంటూ పేర్కొన్నారు. దీంతో భారీగా విరాళాలు కూడా వచ్చాయి.

అయితే వచ్చిన విరాళాలను యూట్యూబర్‌ గౌరవ్‌ వాసన్‌ దుర్వినియోగం చేశాడంటూ కాంతప్రసాద్‌  పోలీసులను ఆశ్రయించాడు. యూట్యూబర్‌ ఉద్దేశపూర్వకంగానే ఆయన కుటుంబసభ్యులు, మిత్రుల బ్యాంకు ఖాతాలను మాత్రమే దాతలతో పంచుకొని భారీ విరాళాలు సేకరించాడని ఆరోపించారు. విరాళాలకు సంబంధించి తనకు ఎలాంటి సమాచారం అందించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై డిప్యూటీ కమిషనర్‌ అతుల్‌ కుమార్‌ స్పందించారు. ఫిర్యాదును పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఇంకా కేసు నమోదు చేయలేదని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని