ఏడు గంటల హింస.. గోడలపై రక్తం

తూత్తుకుడికి చెందిన జయరాజ్‌, ఆయన కుమారుడు బెన్నిక్స్‌లను పోలీసులు ఆరు గంటలకు పైగా హింసించినట్టు సీబీఐ విచారణలో వెల్లడైంది.

Updated : 12 Sep 2022 11:09 IST

తమిళనాడు కస్టడీ మరణాలపై సీబీఐ ఛార్జిషీటు

చెన్నై: తమిళనాడులో జూన్‌లో చోటుచేసుకున్న తండ్రి, కుమారుల కస్టడీ మరణాలు తీవ్ర సంచలనం సృష్టించాయి. ఈ కేసులో తూత్తుకుడికి చెందిన వ్యాపారులు జయరాజ్‌, ఆయన కుమారుడు బెన్నిక్స్‌లను పోలీసులు ఆరు గంటలకు పైగా హింసించినట్టు సీబీఐ విచారణలో వెల్లడైంది. ఈ క్రమంలో ఆ గది గోడలపై రక్తం మరకలు ఉన్నట్లు ఫోరెన్సిక్‌ నివేదికలో తెలిసింది. 

న్యాయమూర్తి‌పైనే దౌర్జన్యం

మొబైల్‌ షాపు యజమానులైన పి జయరాజ్‌ (59), ఆయన కుమారుడు జె బెన్నిక్స్ (31)లు పోలీసు కస్టడీలో మృతి చెందారు. కరోనా లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి దుకాణాన్ని కేవలం పదిహేను నిమిషాలు అధికంగా తెరచి ఉంచారన్న ఆరోపణలతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.  సతంకుళం పోలీస్‌ స్టేషన్‌లో జయరాజ్‌, బెన్నిక్స్‌లపై జూన్‌ 19న విచారణ జరిగింది. అనంతరం వారు తీవ్ర గాయాల వల్ల జూన్‌ 22న కొద్ది గంటల తేడాతో మరణించారు.  వీరు పోలీసుల దౌర్జన్యం వల్లనే చనిపోయారా అనే విషయాన్ని విచారించేందుకు వెళ్లిన  కోవిల్‌పట్టి న్యాయమూర్తి ఎంఎస్‌ భారతీదాసన్‌తో పోలీసు సిబ్బంది బెదిరింపు ధోరణికి పాల్పడ్డారు. ఏ రోజుకారోజు డిలీట్‌ అయ్యే విధంగా ఏర్పాటు చేయటం వల్ల ఆ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్‌ లభించలేదని మేజిస్ట్రేట్‌ దర్యాప్తులో తేలింది.

కస్టడీలో హింస

ఇదిలా ఉండగా.. ఈ కేసులో నిందితులైన పోలీసు అధికారులు జూన్‌ 19 రాత్రి 7:45 నుంచి 3:00 మధ్య జయరాజ్‌ బెన్నిక్స్‌లను క్రూరంగా హింసించారని సీబీఐ తన ఛార్జిషీటులో స్పష్టం చేసింది. ఈ సందర్భంగా చిందిన రక్తాన్ని వారి దుస్తులతోనే శుభ్రం చేయించినట్టు వెల్లడించింది. నిజానికి ఆ వ్యాపారులు లాక్‌డౌన్ నిబంధనలను అతిక్రమించనేలేదని.. పోలీసులు తమ నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు వారిపై తప్పుడు ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారని తమ విచారణలో తేలినట్టు సీబీఐ తెలిపింది. విచారణ నాటి గాయాల వల్లే వారు మరణించినట్టు పోస్ట్‌మార్టం నివేదిక కూడా వెల్లడించింది. రక్తంతో తడిసిన వారి దుస్తులను అక్కడి ప్రభుత్వాసుపత్రిలోని చెత్తబుట్టలో పడేయటం ద్వారా పోలీసులు సాక్ష్యాలను నాశనం చేశారని సీబీఐ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని