వర్షం, నిర్లక్ష్యం ఖరీదు ఓ నిండు ప్రాణం

తెగిపడిన కరెంటు తీగపై అలీమా కాలువేయటంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మరణించినట్టు అనుమానిస్తున్నారు.

Updated : 16 Sep 2020 05:18 IST

చెన్నై: వీధిలో వర్షపు నీరు నిలిచిపోవటంతో వాటిని జాగ్రత్తగా దాటుకుంటూ వెళ్తున్న ఓ మహిళ ఉన్నట్టుండి కింద పడిపోయింది. తన నివాసానికి స్వల్ప దూరంలో ఉండగానే ఆమె ప్రాణాలు కోల్పోయింది. చెన్నై, పెరియార్‌ నగర్‌లోని పుళియాంథోపే ప్రాంతానికి చెందిన అలీమా అనే 35 సంవత్సరాల మహిళ తెగిపడిన కరెంటు తీగపై కాలువేయటంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. ఈ దుర్ఘటనకు చెందిన వీడియోలు.. సామాజిక మథ్యమాల్లో వైరల్‌గా మారాయి.

ఆదివారం నుంచి కురుస్తున్న వర్షాల వల్ల నగరంలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. తెగిపడిన కరెంటు వైర్లను గురించి ఎన్నో ఫిర్యాదులు ఇచ్చినప్పటికీ.. తమిళనాడు విద్యుత్‌ బోర్డు చర్యలే కరువయ్యాయని స్థానికులు తెలిపారు.  మహిళను పొట్టన పెట్టుకున్న వైరు 25 రోజుల క్రితం తెగిపోయిందని.. దీని ద్వారా నీటిలోకి విద్యుత్‌ ప్రవహిస్తోందని వారు తెలిపారు. ఇదివరకు ఓ చిన్నారి కూడా ఇదేవిధంగా విద్యుదాఘాతానికి గురైందని స్థానికులు వెల్లడించారు. అధికారుల నిర్లక్ష్యానికి అలీమా బలైందని వారు వాపోయారు.
ఈ ఘటనపై ప్రముఖ సినీ గాయని చిన్మయి శ్రీపాద స్పందించారు. వివిధ శాఖల అధికారుల నిర్లక్ష్యం.. మహిళ ప్రాణం తీసిందని, ఇది సిగ్గుపడాల్సిన విషయమని ఆమె అన్నారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేశామని.. శవపరీక్ష అనంతరం మాత్రమే మహిళ మరణానికి గల అసలైన కారణం తెలుస్తుందని పోలీసు అధికారులు అంటున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని