కరోనా బాధితురాలిపై వైద్యుడి అత్యాచారయత్నం!

యూపీలోని ఓ ఆస్పత్రిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అలీగఢ్‌లోని దీన్‌ దయాళ్‌ ఆస్పత్రిలో 25 ఏళ్ల యువతిపై.....

Published : 25 Jul 2020 00:20 IST

అలీగఢ్‌: యూపీలోని ఓ ఆస్పత్రిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అలీగఢ్‌లోని దీన్‌ దయాళ్‌ ఆస్పత్రిలో 25 ఏళ్ల యువతిపై అసభ్యంగా ప్రవర్తించిన వైద్యుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. దిల్లీలోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్న యువతి ఇటీవల అలీగఢ్‌కు వచ్చింది. కరోనా లక్షణాలు ఉండటంతో సోమవారం ఆస్పత్రిలో చేరింది. ఈ క్రమంలో ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందుతున్న తనపై వైద్య పరీక్షల పేరుతో తుఫైల్‌ అహ్మద్‌ అనే వైద్యుడు అత్యాచారానికి యత్నించినట్టు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. మంగళవారం రాత్రి వైద్యుడు మహిళా వార్డుకు వచ్చి.. తనను శారీరకంగా వేధించాడని ఆరోపించింది. బుధవారం ఉదయం మళ్లీ వచ్చి అలాగే ప్రవర్తించాడని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. వైద్యుడు విధులు ముగించుకొని ఓ హోటల్‌లో క్వారంటైన్‌లో ఉండగా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన అనంతరం వైద్యుడు ఐసోలేషన్‌ వార్డులోకి ఎలాంటి మాస్క్‌, పీపీఈ కిట్‌ ధరించకుండా ప్రవేశించినట్టు గుర్తించామని పోలీసులు తెలిపారు. వైద్యుడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు చెప్పారు. ఈ ఘటనపై ఆస్పత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ (సిఎంఎస్) నుంచి నివేదిక కోరినట్లు నగర అదనపు మెజిస్ట్రేట్‌ రంజిత్‌ సింగ్ తెలిపారు. తదుపరి చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్టు చెప్పారు. 

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts