వారిని పట్టుకునే వరకు అంత్యక్రియలు చేయబోం

శౌర్యచక్ర బల్విందర్‌సింగ్‌ సంధుని హత్య చేసిన వారిని అదుపులోకి తీసుకునేవరకు మృతదేహానికి అంతిమసంస్కారాలు నిర్వహించబోమని ఆయన కుటుంబం స్పష్టం చేసింది...

Published : 17 Oct 2020 19:38 IST

వెల్లడించిన బల్విందర్‌సింగ్‌ కుటుంబం

చండీగఢ్‌: శౌర్యచక్ర బల్విందర్‌సింగ్‌ సంధుని హత్య చేసిన వారిని అదుపులోకి తీసుకునే వరకూ మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించబోమని ఆయన కుటుంబం స్పష్టం చేసింది. పంజాబ్‌లోని తరన్‌ తారన్‌ జిల్లాలో శుక్రవారం బల్విందర్‌సింగ్‌ని ఇద్దరు దుండగులు తుపాకీతో కాల్చి హత్యచేశారు. కాగా ఇది ఉగ్రవాదుల పనేనని వారిని పట్టుకునే వరకూ సంధు మృతదేహాన్ని ఖననం చేయబోమని కుటుంబసభ్యులు వెల్లడించారు. 

సంధు భార్య జగ్దిశ్‌కౌర్‌ సంధు మాట్లాడుతూ ‘ఇది కచ్చితంగా ఉగ్రవాదుల పనే. హంతకులను పట్టుకునేంతవరకూ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించకూడదని నిశ్చయించుకున్నాం’ అని పేర్కొన్నారు. తమ కుటుంబానికి రక్షణ కల్పించాని ఈ సందర్భంగా ఆమె కోరారు. ‘మా కుటుంబమంతా శౌర్యచక్ర అవార్డు గ్రహీతలమే. ముష్కరులకు వ్యతిరేకంగా పోరాడిన నాకు, నా భర్తకు, ఆయన సోదరుడు రంజిత్‌సింగ్‌ సంధుకు, రంజిత్‌సింగ్‌ భార్య బల్‌రాజ్‌కౌర్‌ సంధుకు కేంద్ర ప్రభుత్వం శౌర్యచక్రతో సత్కరించింది. ఇంటెలిజెన్స్‌ వైఫల్యం కారణంగానే ఈ హత్య చోటు చేసుకుంది’ అని ఆమె తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. తమ కుటుంబానికి రక్షణ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైతే అందుకు కేంద్రం బాధ్యత వహించాలని పేర్కొన్నారు.

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడిన బల్విందర్‌సింగ్‌ సంధును లిఖీవిండ్‌లోని ఆయన ఇంటి వద్దే ఇద్దరు దుండగులు హత్య చేశారు. ఆయన శరీరంలోకి నాలుగు తూటాలు దిగగా ఆసుపత్రికి తరలించేసరికే సంధు ప్రాణాలొదిలారు. ఖలిస్థాన్‌ వేర్పాటువాదులకు వ్యతిరేకంగా పోరాడిన బల్విందర్‌సింగ్‌ కుటుంబాన్ని ప్రభుత్వం 1993లో శౌర్యచక్రతో సత్కరించింది. కాగా గతేడాదే రాష్ట్ర ప్రభుత్వం సింగ్‌కు భద్రతను తొలగించింది. కాగా బల్విందర్‌ హత్యపై స్పందించిన పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ కేసు దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)కు అప్పగించారు.  

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts