పట్టపగలే యువతిపై కాల్పులు.. షాకింగ్‌ వీడియో

దేశరాజధాని దిల్లీకి కూతవేటు దూరంలో మరో దారుణం చోటుచేసుకుంది. ఓ ఉన్మాది పట్టపగలే యువతిపై తుపాకీతో దాడికి తెగబడడం కలకలం సృష్టించింది. ఈ ఘటన హరియాణాలోని ఫరీదాబాద్‌లో(దిల్లీకి 30కిమీ) దూరంలో చోటుచేసుకుంది.

Published : 28 Oct 2020 00:38 IST

దిల్లీ: దేశరాజధాని దిల్లీకి కూతవేటు దూరంలో మరో దారుణం చోటుచేసుకుంది. ఓ ఉన్మాది పట్టపగలే యువతిపై తుపాకీతో దాడికి తెగబడడం కలకలం సృష్టించింది. ఈ ఘటన హరియాణాలోని ఫరీదాబాద్‌లో(దిల్లీకి 30కిమీ) దూరంలో చోటుచేసుకుంది. కాగా బుల్లెట్‌ గాయాలతో బాధితురాలు మరణించడంతో ఫరీదాబాద్‌లో మంగళవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీసీ టీవీ ఫుటేజీల్లో రికార్డయిన ఘటన తాలూకు దృశ్యాలు సంచలనంగా మారాయి. 

బల్లభ్‌గఢ్‌ ఏసీపీ జైవీర్‌ సింగ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఫరీదాబాద్‌కు చెందిన నికిత తోమర్‌(21) అనే యువతి సోమవారం పరీక్ష రాసి కళాశాల నుంచి తిరుగు పయనమైంది. ఈ క్రమంలో గుర్తు తెలియని కారులో నుంచి తౌసిఫ్‌ అనే వ్యక్తి వచ్చి పట్టపగలే ఆమెను కిడ్నాప్‌ చేసేందుకు యత్నించాడు. దీంతో ఆమె ప్రతిఘటించింది. ఈ క్రమంలో తౌసిఫ్‌ తన వెంట తెచ్చుకున్న తుపాకీతో నికితపై కాల్పులు జరిపి పారిపోయాడు. నికిత అక్కడికక్కడే కుప్పకూలిపోవడంతో.. ఆస్పత్రికి తరలించేలోపే బుల్లెట్‌ గాయాలతో ఆమె మరణించింది. ఈ ఘటన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరా ఫుటేజీల్లో రికార్డయ్యాయి. వాటి ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రధాన నిందితుడు తౌసిఫ్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారాయి. కాగా బాధితురాలు, నిందితుడు గతంలో ఒకరికొకరు పరిచయం ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడించారు. గతంలోనూ బాధితురాలి కుటుంబసభ్యులు సదరు నిందితుడిపై కిడ్నాప్‌ కేసు పెట్టారని.. కానీ తర్వాత వెనక్కి తీసుకున్నారని పోలీసులు తెలిపారు. 

ఈ వ్యవహారంపై బాధితురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండు చేశారు. వారిని ఎన్‌కౌంటర్‌ చేసేవరకు తన కుమార్తె అంత్యక్రియలు జరగనివ్వనని అన్నారు. ఈ ఘటనకు వ్యతిరేకంగా ఫరీదాబాద్‌లో రహదారిపై, బాధితురాలి కళాశాల ఎదుట మంగళవారం నిరసనలు చేపట్టడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు ఈ హత్యను సుమోటోగా పరిగణనలోకి తీసుకున్నట్లు జాతీయ మహిళా కమిషన్‌ ఛైర్మన్‌ రేఖా శర్మ తెలిపారు. ఘటనకు బాధ్యులైన ఇతర నిందితులను సైతం వెంటనే పట్టుకోవాలని హరియాణా డీజీపీకి లేఖ రాసినట్లు తెలిపారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని