‘విస్ట్రన్‌’ ఫ్యాక్టరీ ఘర్షణ: భారీగా నష్టం అంచనా!

కర్ణాటకలోని ఐఫోన్ల తయారీ కర్మాగారం ‘విస్ట్రన్‌’లో ఇటీవల జరిగిన ఘర్షణలపై ఆ సంస్థ నష్టాన్ని అంచనా వేసింది. ఉద్యోగుల దాడిలో దాదాపు రూ.437 కోట్లు నష్టపోయినట్లు ఆ సంస్థ సోమవారం వెల్లడించింది.

Published : 15 Dec 2020 01:42 IST

బెంగళూరు: కర్ణాటకలోని ఫోన్ల తయారీ కర్మాగారం ‘విస్ట్రన్‌’లో ఇటీవల జరిగిన ఘర్షణలపై ఆ సంస్థ నష్టాన్ని అంచనా వేసింది.ఈ దాడిలో దాదాపు రూ.437 కోట్లు నష్టపోయినట్లు ఆ సంస్థ సోమవారం వెల్లడించింది. ఈ మేరకు ఆ సంస్థ కార్యనిర్వాహక అధికారి టీడీ ప్రశాంత్‌ వెమగల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రశాంత్‌ ఫిర్యాదులో పేర్కొన్న ప్రకారం.. ‘కంపెనీపై 5వేల మంది కాంట్రాక్టు కార్మికులతో పాటు, 2వేల మంది గుర్తు తెలియని నిందితులు విధ్వంసానికి పాల్పడ్డారు. కార్యాలయానికి సంబంధించిన వస్తువులు, మొబైల్‌ ఫోన్లు, ఉత్పత్తి యంత్రాలు, సంబంధిత వస్తువులను వారు ధ్వంసం చేశారు. ఈ దాడిలో సంస్థకు దాదాపు రూ.412 కోట్ల ఆస్తి నష్టం జరిగింది. అది కాకుండా అదనంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ విషయంలో రూ.10 కోట్ల మేర‌, రూ.60లక్షల మేర కార్లు, రూ.1.50కోట్ల ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులు ధ్వంసమయ్యాయి’ అని తెలిపారు.  కాగా పోలీసులు ఇప్పటి వరకు 149 మంది నిందితుల్ని అరెస్టు చేశారు. 

ఈ ఘటనపై విస్ట్రన్‌ ఇండియా ఎండీ సుదీప్తో గుప్తా ఓ ప్రకటన ద్వారా స్పందిస్తూ.. ‘మేం చట్టాన్ని అనుసరిస్తాం. విచారణలో అధికారులకు సహకారం అందజేస్తాం. మా బృందంలో సభ్యుల భద్రతే మాకు ప్రథమ ప్రాధాన్యత’ అని ఆయన తెలిపారు. కాగా ఇప్పటికే ఈ ఘటనను కర్ణాటక ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. కంపెనీలో విధ్వంసానికి పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. రాష్ట్రంలోని ప్రతిపక్షాలు సైతం ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండు చేశాయి. ఇలాంటి వాటి వల్ల రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి. మరోవైపు ఈ ఘర్షణలపై యాపిల్‌ కంపెనీ సైతం దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపింది.

కర్ణాటకలోని నరసాపురలో ఉన్న విస్ట్రాన్‌ కంపెనీలో ఇటీవల ఉద్యోగులు విధ్వంసానికి పాల్పడిన విషయం తెలిసిందే. నాలుగు నెలలుగా యాజమాన్యం జీతాలు చెల్లించడం లేదని ఆరోపిస్తూ వారు సంస్థ ఆస్తులపై దాడులు చేశారు. ఈ కంపెనీ ఐఫోన్‌7 సహా, ఇతర ఐఫోన్ల తయారీకి కావాల్సి విడి భాగాలను ఉత్పత్తి చేస్తుంది. 

ఇదీ చదవండి

ఫ్యాక్టరీ వద్ద ఘర్షణలపై యాపిల్‌ దర్యాప్తు
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని