రిలయన్స్‌ డిజిటల్‌లో చోరి: ముఠా అరెస్టు

నగరంలోని మియాపూర్‌ రిలయన్స్‌ డిజిటల్‌ షోరూంలో ఇటీవల చోరీకి పాల్పడిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ముంబయికి చెందిన ఐదుగురు...

Published : 09 Dec 2020 01:58 IST

హైదరాబాద్: నగరంలోని మియాపూర్‌ రిలయన్స్‌ డిజిటల్‌ షోరూంలో ఇటీవల చోరీకి పాల్పడిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ముంబయికి చెందిన ఐదుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు, వారి నుంచి రూ.30 లక్షల విలువైన సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ మీడియాకు వెల్లడించారు. గతంలోనూ ఈ ముఠా వివిధ రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడినట్లు సీపీ తెలిపారు. ప్రధాన నిందితుడు(ఎ1) మహమ్మద్ తబ్రేక్ దావూద్‌ ఓ కేసులో జైలుకు వెళ్లాడని.. అక్కడ పరిచయమైన మరో నలుగురితో కలిసి బయటకు వచ్చాక ముఠాగా ఏర్పడి మూసి ఉన్న దుకాణాల్లో దొంగతనాలు చేయడం ప్రారంభించారని తెలిపారు. నిర్మానుష్య ప్రాంతాల్లో సెక్యూరిటీ గార్డులు లేని దుకాణాలనే లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతుంటారని సజ్జనార్ వివరించారు. వీరు చోరీ చేసిన సెల్‌ఫోన్లను ఓఎల్‌ఎక్స్‌లో విక్రయిస్తారని తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో ముంబయి పోలీసులు సహకారం అందించారని సీపీ పేర్కొన్నారు.

నగర శివారు మియాపూర్‌ ఠాణా పరిధి మదీనాగూడలోని రిలయన్స్‌ డిజిటల్‌ షోరూంలో గత నెల 15న సుమారు రూ.40 లక్షల విలువైన సెల్‌ఫోన్లు చోరీకి గురయ్యాయి. ఉదయం సిబ్బంది షోరూంను తెరిచి లోపలికి వెళ్లి చూడగా సెల్‌ఫోన్లన్నీ చెల్లా చెదురుగా పడి ఉండటాన్ని గమనించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని