లారీ అడ్డగించి.. 14,400 మొబైల్‌ ఫోన్లు చోరీ

లారీని అడ్డగించిన కొందరు వ్యక్తులు అందులోని మొబైల్‌ఫోన్లను చోరీ చేసిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. తమిళనాడులోని ఓ కంపెనీ మొబైల్‌ ప్లాంట్‌ నుంచి లారీలో రూ. 15 కోట్లు విలువ చేసే 14,400 ఫోన్లు ముంబయికి తీసుకెళుతుండగా

Updated : 23 Oct 2020 04:18 IST

చెన్నై : సెల్‌ఫోన్ల లోడుతో వెళుతున్న లారీని అడ్డగించిన కొందరు వ్యక్తులు అందులోని మొబైల్‌ ఫోన్లను చోరీ చేసిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. తమిళనాడులోని ఓ కంపెనీ మొబైల్‌ ప్లాంట్‌ నుంచి లారీలో రూ. 15 కోట్లు విలువ చేసే 14,400 ఫోన్లు ముంబయికి తీసుకెళుతుండగా కొందరు ఆ వాహనాన్ని రోడ్డుపై మరో లారీతో అడ్డగించారు. మొబైల్‌ ఫోన్లు ఉన్న లారీలోని డ్రైవర్‌, క్లీనర్‌ల చేతులు, కాళ్లను తాళ్లతో కట్టేసిన దుండగులు లారీలోని ఫోన్లు ఉన్న బాక్సులను వాళ్ల లారీలోకి ఎక్కించారు. అనంతరం డ్రైవర్‌, క్లీనర్లను రోడ్డుకు సమీపంలోని ఓ ముళ్లపొదల్లో పడేశారు. లారీని సైతం దుండగులు తీసుకెళ్లారు. ఘటన జరిగిన ప్రాంతానికి 8 కిమీ దూరంలో ఆ లారీని వాళ్లు వదిలేశారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తమిళనాడులోని కృష్ణగిరి ప్రాంతంలో ఈ చోరీ జరిగినట్లు పోలీసులు తెలిపారు. 

తమిళనాడు- బెంగళూరు జాతీయ రహదారిపై పది మంది వ్యక్తులు ఈ చోరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన కొంతసేపటికి కాళ్లు, చేతులకు కట్టిన తాళ్లను విడిపించుకున్న ఇద్దరు వ్యక్తులు రోడ్డు పైకి చేరుకున్నారు. అటుగా వెళ్తున్న 108 వాహనంలో వాళ్లు స్థానిక ఆసుప్రతికి చేరుకొని పోలీసులకు చోరీ సమాచారం తెలియజేశారు. లారీ డ్రైవర్‌, క్లీనర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 17 ప్రత్యేక బృందాలతో దుండగులను గాలిస్తున్నట్లు వెల్లడించారు.  

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని