హైకోర్టు న్యాయవాది దంపతుల దారుణహత్య

పెద్దపల్లి జిల్లాలో తెలంగాణ హైకోర్టు న్యాయవాది దంపతులపై దాడి జరిగింది. రామగిరి మండలం కలవచర్ల పెట్రోల్‌ బంకు సమీపంలో న్యాయవాది వామన్‌రావు,

Updated : 18 Feb 2021 01:42 IST

రామగిరి: తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది. హైకోర్టు న్యాయవాది దంపతులు దారుణహత్యకు గురయ్యారు. వారిపై దుండగులు విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చారు. న్యాయవాది గట్టు వామన్‌రావు, ఆయన భార్య నాగమణి మంథని కోర్టులో పని ముగించుకుని హైదరాబాద్‌ వెళ్తుండగా రామగిరి మండలం కల్వచర్ల పెట్రోలు బంకు ఎదుట గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించి వారిపై దాడికి పాల్పడ్డారు.

కారులో ఉన్న వామన్‌రావు, నాగమణిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. 108 వాహనంలో పెద్దపల్లి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో వారిద్దరూ మృతిచెందారు. న్యాయవాది దంపతుల హత్య నేపథ్యంలో దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. చెక్‌పోస్టుల వద్ద ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు న్యాయవాది కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

తెరాస మండల అధ్యక్షుడి పేరు ప్రస్తావించిన వామన్‌రావు

చావుబతుకుల మధ్య ఉన్న సమయంలో తెరాస మంథని మండల అధ్యక్షుడు కుంట శ్రీనివాస్‌ పేరును వామన్‌రావు ప్రస్తావించారు. వామన్‌రావు, శ్రీనివాస్‌ల స్వస్థలం మంథని మండలం గుంజెపడుగు. శీలం రంగయ్య లాకప్‌డెత్‌ కేసును వామన్‌రావు వాదించారు. భూ ఆక్రమణలపై సామాజిక మాధ్యమాల్లో ఆయన స్పందించారు. ఈ నేపథ్యంలో కుంట శ్రీనివాస్‌, కుమార్‌లపై తమకు అనుమానం ఉన్నట్లు వామన్‌రావు సోదరుడు ఇంద్రశేఖర్‌ ఆరోపించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి తమకు న్యాయం చేయాలని ఆయన కోరారు. 

నిందితులు ఎంతటివారైనా వదలం: రామగుండం సీపీ

హైకోర్టు న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య కేసుపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని రామగుండం సీపీ సత్యనారాయణ చెప్పారు. దుండగులను పట్టుకునేందుకు ఆరు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామన్నారు. దంపతులు మంథని నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా మధ్యాహ్నం 2.30గంటల సమయంలో దుండగులు కారు ఆపి వారిపై దాడికి పాల్పడ్డారని చెప్పారు. నిందితులు ఎంతటివారైనా వదలబోమని సీపీ స్పష్టం చేశారు. 


 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని