50 మందిని చంపాక.. లెక్క మర్చిపోయా!

యాభై తరువాత తాను హత్యలను లెక్కపెట్టలేదని అతను వెల్లడించటంతో పోలీసులు నిర్ఘాంతపోయారు.

Published : 30 Jul 2020 23:35 IST

విచారణలో వెల్లడించిన ‘సీరియల్‌ కిల్లర్‌’ వైద్యుడు

దిల్లీ: దేశ రాజధానితో సహా అనేక రాష్ట్రాల్లో వరుస హత్యలకు పాల్పడిన ఓ వైద్యుడిని దిల్లీ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. విచారణలో భాగంగా 50 తరువాత తాను హత్యలను లెక్కపెట్టలేదని అతను వెల్లడించటంతో పోలీసులు నిర్ఘాంతపోయారు. దిల్లీ, ఉత్తర్‌ ప్రదేశ్‌, హరియాణ, రాజస్థాన్‌లలో ఇతనిపై పలు కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య కచ్చితంగా నిర్ధారణ కానప్పటికీ.. వందకు పైగా హత్యల్లో ఈ వైద్యుడి ప్రమేయం ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు.  పోలీసుల కథనం ప్రకారం.. వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తర్‌ప్రదేశ్‌, అలీఘర్‌కు చెందిన దేవేందర్‌ శర్మ (62) ఆయుర్వేద వైద్యం, శస్త్రచికిత్సలో పట్టభద్రుడు. తొలుత వైద్యవృత్తినే చేపట్టినా.. అనంతరం దారితప్పి పలు కిడ్నాప్‌, హత్య కేసుల్లో భాగస్వామి అయ్యాడు. నకిలీ గ్యాస్‌ ఏజెన్సీ నిర్వహణ, మూత్రపిండాల అక్రమ అమ్మకం వంటి నేరాలపై గతంలో కూడా శర్మ జైలుశిక్షను అనుభవించాడు. దేవేందర్‌, అతని భాగస్వాములు గ్యాస్‌ సిలిండర్లతో కూడిన ట్రక్కులను తమ నకిలీ గ్యాస్‌ ఏజెన్సీ వద్ద ఆపేవారు. డ్రైవర్లను హత్య చేసి టక్కులోని సిలండర్లను సొంతం చేసుకునేవారు. మృతదేహాలను కాష్‌గంజ్‌ వద్ద మొసళ్లకు నిలయమైన హజారా కాలువలో పడేసేవారని దిల్లీ పోలీసులు తెలిపారు.

నిందితుడు ఓ హత్య కేసులో జైపూర్‌ కేంద్ర కారాగారంలో జీవితకాల శిక్ష అనుభవిస్తున్నాడు. 16 సంవత్సరాల శిక్షాకాలం అనంతరం ఇతనికి జనవరిలో 20 రోజుల పెరోల్‌ లభించింది. ఆ తర్వాత గడువు ముగిసినా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. చివరకు దిల్లీ శివారు ప్రాంతమైన బప్రోలాలో అతని ఆచూకీ చిక్కడంతో పోలీసులు అరెస్టు చేశారు. విచారణ సందర్భంగా తనకు 50కి పైగా హత్యకేసుల్లో ప్రమేయమున్నట్టు అంగీకరించాడు. కేసుకు సంబంధించిన వివరాలను తెలియ చేసిన అనంతరం.. దేవేందర్‌ శర్మను జైపూర్‌ పోలీసులకు అప్పగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని