టపాసులు పేలి ఎంపీ మనవరాలి మృతి

భాజపా సీనియర్‌ నాయకురాలు, ప్రయాగ్‌రాజ్‌ ఎంపీ రిటా బహుగుణ జోషీ ఇంట్లో దీపావళి పండగ విషాదం నింపింది. బాణాసంచా మంటలు అంటుకుని రిటా ఆరేళ్ల మనవరాలు ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఎంపీ

Updated : 17 Nov 2020 14:32 IST

ప్రయాగ్‌రాజ్(ఉత్తరప్రదేశ్‌)‌: భాజపా సీనియర్‌ నాయకురాలు, ప్రయాగ్‌రాజ్‌ ఎంపీ రిటా బహుగుణ జోషీ ఇంట్లో దీపావళి పండగ విషాదం నింపింది. బాణాసంచా మంటలు అంటుకుని రిటా ఆరేళ్ల మనవరాలు ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఎంపీ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. 

ప్రయాగ్‌రాజ్‌లోని రిటా బహుగుణ జోషీ నివాసంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. స్థానిక మీడియా కథనం ప్రకారం.. దీపావళి రోజు రాత్రిపూట రిటా మనవరాలు కియా టపాసులు పేల్చేందుకు ఇంటి టెర్రస్‌పైకి వెళ్లింది. టపాసులు అంటిస్తుండగా కియా దుస్తులకు నిప్పంటుకుంది. అయితే బాణాసంచా పేలుడు శబ్దాల వల్ల చిన్నారి అరుపులు ఎవరికీ వినిపించలేదు. కొద్దిసేపటి తర్వాత గాయాలతో పడి ఉన్న కియాను గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి శరీరం 60శాతం కాలిపోయింది. 

ఘటన అనంతరం రిటా బహుగుణ జోషీ.. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్‌, హర్షవర్ధన్‌, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో మాట్లాడారు. మెరుగైన చికిత్స నిమిత్తం చిన్నారిని దిల్లీకి తరలించేందుకు సాయం చేయాలని కోరారు. మంగళవారం చిన్నారిని దిల్లీకి తరలించాల్సి ఉండగా.. పరిస్థితి విషమించి నేటి తెల్లవారుజామున కియా కన్నుమూసింది. కాగా, ఇటీవలే కరోనా బారిన పడి కోలుకున్న ఈ చిన్నారి.. దురదృష్టవశాత్తూ ఇలా ప్రాణాలు కోల్పోవడంతో రిటా కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని