రాయ్‌గఢ్‌ బాధితులకు నష్ట పరిహారం

మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌ జిల్లాలో ఐదంతస్తుల భవనం కుప్పకూలిన ఘనటలో బాధిత కుటుంబాలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.....

Published : 27 Aug 2020 00:48 IST

16కు చేరిన మృతుల సంఖ్య

ముంబయి: మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌ జిల్లాలో ఐదంతస్తుల భవనం కుప్పకూలిన ఘనటలో బాధిత కుటుంబాలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.  ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు రూ.5లక్షలు ఇవ్వనున్నట్లు మహారాష్ట్ర మంత్రి విజయ్‌ వాడేతివార్‌ ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారికి రూ.50వేల వరకు ఆర్థిక సహాయం అందించనున్నట్లు వెల్లడించారు. ఘటనలో ఇళ్లు కోల్పోయిన వారికి కూడా సహాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. భవనాన్ని నాణ్యతాలోపంతో నిర్మించారని.. ఘటనకు బాధ్యులైన వారిని విడిచిపెట్టేది లేదని ఆయన స్పష్టం చేశారు. 

మహద్‌ ప్రాంతంలో సోమవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో పదేళ్ల నాటి ఐదంతస్తుల భవనం కుప్పకూలిన విషయం తెలిసిందే. 75 మందికిపైగా శిథిలాల్లో చిక్కుకుపోగా.. ఘటనా స్థలికి చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఇప్పటి వరకు పలువురిని రక్షించారు. మిగతా వారి కోసం ఎన్టీఆర్‌ఎఫ్‌ బృందాల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 16కి చేరింది.

ఈ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ‘మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌ జిల్లాలో జరిగిన దుర్ఘటన తీవ్రంగా కలచివేసింది. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’ అంటూ ప్రధాని ట్వీట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని