ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాను.. అమ్మానాన్న నన్ను క్షమించండి 

‘నా చావుకు ఎవరూ బాధ్యులు కాదు. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తానని నమ్మకం లేదు. ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను. అమ్మ, నాన్న క్షమించండి..’ అంటూ లేఖ రాసి వైద్య విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది.

Updated : 01 Nov 2021 09:11 IST

వైద్య విద్యార్థిని బలవన్మరణం

లక్ష్మీలాలస

నెల్లూరు (నేర విభాగం), న్యూస్‌టుడే: ‘నా చావుకు ఎవరూ బాధ్యులు కాదు. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తానని నమ్మకం లేదు. ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను. అమ్మ, నాన్న క్షమించండి..’ అంటూ లేఖ రాసి వైద్య విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు గ్రామీణ మండల పరిధిలోని ఓ దంత వైద్య కళాశాలలో ఈ ఘటన జరిగింది. కడప జిల్లాలోని ఎర్రగుంట్లకు చెందిన ఎర్రంరెడ్డి లక్ష్మీలాలస(21) బీడీఎస్‌ నాలుగో సంవత్సరం చదువుతోంది. పరీక్షలు సమీపిస్తుండడంతో ఒత్తిడికి గురైంది. శనివారం రాత్రి లేఖ రాసి హాస్టల్‌లోని గదిలో చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తన చావుకు ఎవరూ బాధ్యులు కాదని, ఒత్తిడికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో పేర్కొంది. ఆదివారం ఉదయం స్నేహితులు తలుపులు తట్టగా స్పందన లేకపోవడంతో కిటికీ నుంచి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించింది. దీంతో కళాశాల యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. గ్రామీణ పోలీసుస్టేషన్‌ సీఐ వెంకటరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఆమె రాసిన లేఖను స్వాధీనం చేసుకున్నారు. విషయాన్ని లాలస కుటుంబ సభ్యులకు తెలియజేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని