బలోచ్‌లోని పాక్‌ సైనిక పోస్టుపై భీకర దాడి!

పాక్‌లోని బలోచిస్థాన్‌ ప్రావిన్స్‌లో ఆ దేశ సైనికులపై వేర్పాటువాదులుగా అనుమానిస్తున్న కొందరు ఆదివారం విరుచుకుపడ్డారు. హర్నాయ్‌ వద్ద ఉన్న చెక్‌పోస్ట్‌పై వీరు జరిపిన ఈ దాడిలో సుమారు ఏడుగురు పాక్‌ సైనికులు మృత్యువాత చెందారు.

Published : 28 Dec 2020 01:04 IST

ఇస్లామాబాద్‌: పాక్‌లోని బలోచిస్థాన్‌ ప్రావిన్స్‌లో ఆ దేశ సైనికులపై వేర్పాటువాదులుగా అనుమానిస్తున్న కొందరు ఆదివారం విరుచుకుపడ్డారు. హర్నాయ్‌ వద్ద ఉన్న చెక్‌పోస్ట్‌పై వీరు జరిపిన ఈ దాడిలో సుమారు ఏడుగురు పాక్‌ సైనికులు మృత్యువాత చెందారు. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పాక్‌ ఆర్మీ అధికారులు వివరాలు వెల్లడించారు. ‘హార్నాయ్‌ ప్రాంతంలోని ఔట్‌పోస్ట్‌పై కొందరు దాడికి తెగబడ్డారు. ఈ క్రమంలో ఇరువైపులా కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఏడుగురు పాక్‌ సైనికులు మరణించారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు ఆ ప్రాంతంలో భారీ ఆపరేషన్‌ కొనసాగుతోంది. తప్పించుకోకుండా మార్గాల్ని నిర్బంధించాం’ అని ఆర్మీ వర్గాలు తెలిపాయి. 

ఈ దాడిపై పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ మాట్లాడుతూ.. ‘ఎంతో దిగ్భ్రాంతికి గురి చేసే ఘటన ఇది. మరణించిన సైనికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నా’ అని ప్రకటించారు. కాగా గత ఐదు రోజుల నుంచి బలోచ్‌ ప్రావిన్స్‌లో ఉగ్రవాదుల కోసం సైనికులు గాలింపు కొనసాగిస్తున్న క్రమంలో.. ఈ దాడి జరగడం గమనార్హం. ఈ దాడి వెనక బలోచ్‌ నేషనలిస్ట్‌ సంస్థకు చెందినవారి హస్తం ఉండొచ్చని భావిస్తున్నారు.

ఇదీ చదవండి

పాక్‌ను ఎగదోసి.. పక్కకు తప్పుకొని

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని