తండ్రిని చంపి.. సీరియల్‌ చూసి

బాలుడు తన తండ్రిని చంపి.. సాక్ష్యాలను నాశనం చేసేందుకు ఓ క్రైమ్‌ సీరియల్‌ను ఆశ్రయించిన దిగ్భ్రాంతికర ఘటన

Published : 30 Oct 2020 01:21 IST

మైనర్‌ బాలుడి ఘాతుకం

మథుర: పదిహేడు సంవత్సరాల బాలుడు తన తండ్రిని చంపి.. సాక్ష్యాలను నాశనం చేసేందుకు ఓ క్రైమ్‌ సీరియల్‌ను ఆశ్రయించిన దిగ్భ్రాంతికర ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. 12వ తరగతి (ఇంటర్మీడియెట్‌) చదువుతున్న బాలుడుని పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. బాలుడి ఫోన్‌ను పరిశీలించిన వారికి.. సాక్ష్యాధారాలను మాయం చేసేందుకు అతను క్రైమ్‌ పెట్రోల్‌ టీవీ సీరియల్‌ను 100 సార్లు చూసినట్టు తెలిసింది. వివరాలు ఇలా ఉన్నాయి..

మృతుడు గీతా ప్రవచనకర్త

42 ఏళ్ల మనోజ్‌ మిశ్రా  ధార్మిక సంస్థ ఇస్కాన్‌లో విరాళాల సేకరణ కర్తగా విధులు నిర్వహించేవారు. ఆయన మే 2న తన కుమారుడిని తీవ్రంగా మందలించారు. దీంతో ఆవేశానికి లోనైన ఆ బాలుడు ఓ ఇనుప రాడ్‌తో తండ్రి తలపై కొట్టాడు. కిందపడ్డ అతని గొంతుకు ఓ వస్త్రం బిగించి ఊపిరాడకుండా చేసి చంపాడు. అదే రాత్రి తల్లి సంగీతా మిశ్రా సహాయంతో మృతదేహాన్ని ద్విచక్ర వాహనంపై ఐదు కి.మీ దూరంలోని అడవి ప్రాంతంలోకి తరలించారు. ఆధారాలు లభించకుండా పెట్రోలు, టాయిలెట్‌ క్లీనర్‌తో మిశ్రా శరీరాన్ని దగ్ధం చేశారు. మరుసటి రోజు పోలీసులు పాక్షికంగా కాలిన స్థితిలో శరీరాన్ని కనుగొన్నారు. అయితే మిస్సింగ్‌ కేసు కూడా ఏదీ నమోదు కానందున సుమారు మూడు వారాల పాటు మృతదేహం వివరాలు లభించలేదు. భగవద్గీత ప్రవచనాలు ఇచ్చే క్రమంలో మిశ్రా వివిధ ప్రాంతాలకు వెళ్తుండటంతో బహుశా అలా వెళ్లి ఉంటారని అందరూ అనుకున్నారు.

ఇదిలా ఉండగా ఇస్కాన్‌ సంస్థ నుండి ఒత్తిడి రావడంతో మృతుడి కుటుంబం మే 27న పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసుల సూచనతో మృతదేహాన్ని చూసిన కొందరు సహోద్యోగులు.. దాని వద్ద లభించిన కళ్లజోడును బట్టి మిశ్రాను గుర్తించారు. ఇక మృతుడి కుమారుడిని ఎప్పుడు విచారణకు పిలిచినా ఏదో ఒక కారణంతో తప్పించుకోవటంతో సందేహించిన పోలీసులు.. మైనర్‌ బాలుడి ఫోన్‌ను తనిఖీ చేశారు. హిస్టరీలో క్రైమ్‌ సీరియల్‌ వంద సార్లకు పైగా చూసినట్టు ఉండటంతో బాలుడిని పలు దఫాలు ప్రశ్నించారు. చివరకు అతను నేరం అంగీకరించాడు. హత్యానేరంతో పాటు సాక్ష్యాలను నాశనం చేసేందుకు ప్రయత్నించినందుకు మైనర్‌ బాలుడు, అతని తల్లిపై కేసు నమోదు చేశారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని