మొబైల్‌ఫోన్ల లారీని అపహరించిన దుండగులు

చిత్తూరు జిల్లా నగరి వద్ద సినీఫక్కీలో చోరీ జరిగింది. మొబైల్‌ ఫోన్ల రవాణా లారీని దుండగులు అపహరించారు. తమిళనాడులోని కాంచీపురం శ్రీపెరంబూరు నుంచి షియోమీ సంస్థ గోదాముకు లారీ వెళ్తుండగా తమిళనాడు-ఏపీ సరిహద్దు వద్ద....

Published : 27 Aug 2020 00:44 IST

చిత్తూరు జిల్లా నగరి వద్ద ఘటన

పుత్తూరు: చిత్తూరు జిల్లా నగరి వద్ద సినీఫక్కీలో చోరీ జరిగింది. మొబైల్‌ ఫోన్ల రవాణా లారీని దుండగులు అపహరించారు. తమిళనాడులోని శ్రీపెరుంబుదూరు నుంచి ముంబయిలోని ఎంఐ సంస్థ గోదాముకు లారీ వెళ్తుండగా తమిళనాడు-ఏపీ సరిహద్దు సమీపంలో ఈ ఘటన జరిగింది. ఏపీ సరిహద్దులోకి రాగానే దుండగులు లారీని అడ్డగించి డ్రైవర్‌, కాళ్లు, చేతులు కట్టి కిందపడేశారు. అనంతరం లారీని తీసుకెళ్లి పుత్తూరు సమీపంలోని మరాఠీ గేటు వద్ద వదిలి పరారయ్యారు. లారీ డ్రైవర్‌ ఫిర్యాదు మేరకు నగరి పోలీసులు విచారణ చేపట్టారు. తమిళనాడు సరిహద్దు అవతలి నుంచే కొంతమంది లారీని అనుసరించినట్లు డ్రైవర్‌ పోలీసులకు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లారీలో 16 పెట్టెల్లో రూ.12 కోట్ల విలువైన 15వేల మొబైల్‌ ఫోన్లను ముంబయికి తరలిస్తున్నారు. వీటిలో 8 పెట్టెల్లోని ఫోన్లను మాత్రమే దుండగులు అపహరించి మిగతా 8 పెట్టెలను వదిలేసి వెళ్లారు. మొబైల్‌ ఫోన్లను మరో లారీలోకి మార్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అపహరించిన ఫోన్ల విలువ రూ.7కోట్ల వరకు ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై శ్రీపెరుంబుదూరులోని ఎంఐ కార్యాలయానికి పోలీసులు సమాచారం ఇచ్చారు. అక్కడి నుంచి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు దుండగులను పట్టుకునేందుకు వారు ఎటువైపు వెళ్లి ఉంటారనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని