కలెక్టర్‌పై హత్య కేసు నమోదు

జిల్లా కలెక్టర్‌పై హత్యానేరం కేసు నమోదైన ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది.

Updated : 16 Nov 2020 14:22 IST

మల్కన్‌గిరి: జిల్లా కలెక్టర్‌పై హత్యానేరం కేసు నమోదైన ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. హత్యా నేరం, సాక్ష్యాలను నాశనం చేసినందుకు మల్కన్‌గిరి జిల్లా కలెక్టర్‌, సంబంధిత సిబ్బందిపై కేసు నమోదు చేయాల్సిందిగా స్థానిక సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. మాజీ వ్యక్తిగత కార్యదర్శి (పీఏ) దేబ్‌ నారాయణ్‌ పండా మృతికి సంబంధించి కలెక్టర్‌ మనీష్‌ అగర్వాల్‌, మరో ముగ్గురు సిబ్బందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు  తెలిపారు.

మాజీ పీఏ పండా కనిపించటం లేదంటూ గత సంవత్సరం ఆయన కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఆయన మృతదేహం గత డిసెంబర్‌ 28న మల్కన్‌గిరి పట్టణ సమీపంలోని ఓ రిజర్వాయర్‌లో లభించింది. పండా ఆత్మహత్య చేసుకున్నారని తొలుత భావించారు. ఐతే ఆరునెలల అనంతరం కలెక్టర్‌, మరి కొందరు సిబ్బంది తన భర్తను హత్య చేశారని ఆయన భార్య ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలంటూ ఆమె రాష్ట్ర మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించటంతో.. ఈ వ్యవహారంలో చర్య తీసుకోవాల్సిందిగా పోలీసు డీఐజీకి ఆదేశాలు జారీఅయ్యాయి. దీనితో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కాగా, తనపై నమోదైన హత్య కేసు నమోదు విషయంపై కలెక్టర్‌ మనీష్‌ అగర్వాల్‌ స్పందించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని