యువకుడి నిర్లక్షానికి నిండు ప్రాణం బలి!

ఓ యువకుడి నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఓ కుటుంబాన్ని రోడ్డున పడేసింది. అవగాహన లేకపోవటం, జాగ్రత్తలు పాటించకపోవటం వల్ల నిత్యం ఎంతో మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇదే తీరుగా..........

Published : 27 Dec 2020 00:56 IST

హైదరాబాద్: ఓ యువకుడి నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఓ కుటుంబాన్ని రోడ్డున పడేసింది. అవగాహన లేకపోవటం, జాగ్రత్తలు పాటించకపోవటం వల్ల నిత్యం ఎంతో మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇదే తీరుగా నగరంలో ఇటీవల జరిగిన ఘటన ఓ కుటుంబంలో నింపిన విషాదం, ఆ ఇంటి అరణ్య రోదన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

నగరంలోని సరూర్‌నగర్ వెంకటేశ్వర కాలనీకి చెందిన సుబ్బారావు, ప్రగా టూల్స్‌లో డిప్యూటీ మేనేజర్‌గా పనిచేసి కొన్ని రోజుల క్రితం పదవీ విరమణ పొందారు. ఆయనకు ఓ కుమార్తె. వైకల్యంతో పుట్టిన ఆమెను సీఏ చదివిస్తున్నారు. ఆమె పరీక్షా కేంద్రాన్ని ముందుగా చూసేందుకు ఈ నెల 19న హబ్సిగూడకు వెళ్లిన ఆయన అక్కడ రోడ్డు దాటుతుండగా అతి వేగంగా వచ్చిన ఓ ద్విచక్ర వాహనం ఢీకొంది. దీంతో ఆయన రోడ్డుపై పడిపోయారు. వాహనం నడిపిస్తున్న ఉప్పల్‌కు చెందిన ప్రదీప్‌, అతని స్నేహితుడు.. సుబ్బారావు కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, ఆటోలో ఆయనను ఇంటి వద్ద వదిలి వెళ్లారు. వెంటనే ఆయనను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. తలకు బలమైన గాయం కావడం వల్ల కోమాలోకి వెళ్లిపోయారు.

ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ ఆదివారం సుబ్బారావు మృతి చెందారు. ఈ ప్రమాదంపై విచారణ చేపట్టిన ఓయూ పోలీసులు.. ఆయనను ఢీకొట్టిన ప్రదీప్‌ను అదుపులోకి తీసుకున్నారు. డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న ఈ యువకుడు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే వాహనం నడిపినట్లు గుర్తించారు. లైసెన్స్ లేకున్నా, నిబంధనలు తెలియకున్నా కుమారుడు అడిగిన వెంటనే తల్లిదండ్రులు బైక్‌ కొనిచ్చారు. ఈ క్రమంలోనే కనీస నిబంధనలు మరిచిన ప్రదీప్‌ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో ఓ కుటుంబం రోడ్డున పడేందుకు కారణమయ్యాడు. కుటుంబానికే పెద్ద దిక్కైన ఆయన మరణంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. తమలాంటి పరిస్థితి మరెవరికీ రాకూడదని ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని