ఆ గ్యాంగ్‌స్టర్‌ ఆస్తులపై ఈడీ విచారణకు సిఫారసు!

ఎన్‌కౌంటర్‌లో హతమైన గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబేకు చెందిన రూ.150 కోట్ల విలువైన ఆస్తులపై ఈడీతో దర్యాప్తు జరిపించాలని సిట్‌ సూచించింది. యూపీలో ఎనిమిది మంది పోలీసులను చంపిన ఈ గ్యాంగ్‌స్టర్‌ జులైలో .........

Published : 02 Dec 2020 01:48 IST

90మంది అధికారులపైనా కఠిన చర్యలు తీసుకోవాలన్న సిట్‌ 

లఖ్‌నవూ: ఎన్‌కౌంటర్‌లో హతమైన గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబేకు చెందిన రూ.150 కోట్ల విలువైన ఆస్తులపై ఈడీతో దర్యాప్తు జరిపించాలని సిట్‌ సూచించింది. యూపీలో ఎనిమిది మంది పోలీసులను చంపిన ఈ గ్యాంగ్‌స్టర్‌ జులైలో జరిగిన ఎన్‌కౌంటర్‌ హతమైన విషయం తెలిసిందే. అయితే, ఈ ఘటనలపై  రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త చీఫ్‌ సెక్రటరీ సంజయ్‌ భూస్రెడ్డి నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను ఏర్పాటు చేసింది. అన్ని కోణాల్లో సమగ్రంగా దర్యాప్తు చేసిన సిట్‌ అధికారులు.. 3100 పేజీల నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. వికాస్‌ దూబే, అతడి గ్యాంగ్‌కు సహకరించిన పోలీస్‌, గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ, ఆహారం, తదితర శాఖలకు చెందిన మొత్తం 90 మంది అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ అధికారులంతా వికాస్‌ దూబే సామ్రాజ్య విస్తరణకు సహకరించారని నివేదికలో పేర్కొంది. అక్టోబర్‌లో సిట్‌ సమర్పించిన నివేదికకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 

వికాస్‌ దూబేపై వచ్చిన ఫిర్యాదులను పట్టించుకోకపోగా.. అధికారులు అతడికి, ఆ గ్యాంగ్‌కు నకిలీ ధ్రువీకరణపత్రాలతో ఆయుధాలు, సిమ్‌కార్డులు, పాస్‌పోర్టులను సమకూర్చినట్టు సిట్‌ తన నివేదికలో వెల్లడించింది. వారందరిపైనా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. అలాగే, వికాస్‌ దూబే అక్రమాస్తులపై ఈడీతో సమగ్రంగా దర్యాప్తు చేయించాలంది. ఇటీవలే కాన్పూర్‌ పోలీస్‌ చీఫ్‌ అనంత్‌ దేవ్‌ను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. 

యూపీలోనే కరడుగట్టిన నేరస్థుల్లో వికాస్‌ దూబే ఒకడు. అతడిపై హత్య కేసులు సహా దాదాపు 60 కేసులు ఉన్నాయి. పలుమార్లు పోలీసులు అరెస్టు చేసినా ఎలాగోలా తప్పించుకోగలిగాడు. అయితే, జులై 2న కాన్పూర్‌ జిల్లాలోని ఓ గ్రామంలో నివసిస్తున్న అతడిని అరెస్టు చేసేందుకు పోలీసులు వస్తున్నారని ముందే పసిగట్టాడు. రాష్ట్ర రాజధాని నుంచి 150 కి.మీ. దూరంలో ఉండే గ్రామం వరకు అనేక చోట్ల రహదారిని బ్లాక్‌ చేయించాడు. రోడ్డుకు అడ్డంగా ఉంచిన ఓ బుల్డోజర్‌ సహా పోలీసులు పలు అడ్డంకులను తొలగించుకొని ముందుకుసాగారు. నేరస్థుడు ఉంటున్న గ్రామానికి చేరుకోగానే ఓ ఇంటి దాబాపై మాటువేసిన దుండగులు పోలీసులపై ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. వారి వాహనాలపై బులెట్ల వర్షం కురిపించారు. ఈ ఘటనలో 8 మంది పోలీసులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరికొందరికి గాయాలైన ఘటన అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనమైన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి

దూబే అండ్‌ గ్యాంగ్‌.. ఏన్‌ ఎన్‌కౌంటర్‌ స్టోరీ!

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని