న్యాయవ్యవస్థతో ఆటలా? సుప్రీం ఆగ్రహం

న్యాయస్థానానికి అసౌకర్యం కలిగించినందుకు ఓ న్యాయవాదికి సుప్రీంకోర్టు రూ.25,000 జరిమానా విధించింది.

Published : 05 Sep 2020 01:47 IST

న్యాయవాదికి జరిమానా

దిల్లీ: పదే పదే పిటిషన్లు వేసి, న్యాయస్థానానికి అసౌకర్యం కలిగించినందుకు ఓ న్యాయవాదికి సుప్రీంకోర్టు రూ.25,000 జరిమానా విధించింది. రషీద్‌ ఖాన్‌ పఠాన్‌ అనే ఈ న్యాయవాది వైఖరి.. న్యాయవ్యవస్థను దుర్వినియోగం చేసే విధంగా ఉందని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. వివరాలు ఇలా ఉన్నాయి..

సుప్రీం కోర్టు న్యాయమూర్తులు నారీమన్‌, వినీత్‌ శరణ్‌లపై అవమానకర, నిందాపూర్వక ఆరోపణలు చేసినందుకు రషీద్‌ ఖాన్‌ పఠాన్‌తో సహా విజయ్‌ కుర్లే, నీలేష్‌ ఓఝాలపై ఇదివరకు కోర్టు ధిక్కార నేరం నమోదైంది. ఈ కేసులో తమను దోషులుగా పేర్కొన్న న్యాయస్థానం తీర్పును మళ్లీ పరిశీలించాల్సిందిగా కోరుతూ రషీద్‌ పదేపదే విజ్ఞాపనలు చేయటంతో కోర్టు అసహనాన్ని వ్యక్తం చేసింది. ‘‘న్యాయవ్యవస్థ అమలులో తీర్పుకు అత్యంత ప్రాముఖ్యం, పవిత్రత ఉన్నాయి. న్యాయస్థానం పరిధిలో ఆ తీర్పు అంతిమం. ఇప్పటికే తీర్పు ఇచ్చిన కేసులు తిరిగి తెరిచేందుకు అనుమతినివ్వడం, వారు అదే పనిగా దరఖాస్తులు చేయటం.. కచ్చితంగా న్యాయ వ్యవస్థ దుర్వినియోగం కిందికే వస్తుంది. ఇది న్యాయవ్యవస్థ పనితీరుపై దుష్రభావం చూపిస్తుంది’’ అని సుప్రీం పేర్కొంది. ఈ అప్పీలును కొట్టివేస్తూ.. రూ.25,000 జరిమానా చెల్లించాల్సిందిగా ఫిర్యాదుదారును కోర్టు ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని