జర్నలిస్ట్‌ దారుణ హత్య

తమిళనాడుకు చెందిన టీవీ జర్నలిస్ట్‌ దారుణ హత్యకు గురయ్యాడు. తమ అక్రమ దందాపై పోలీసులకు సమాచారం ఇచ్చాడనే నెపంతో జర్నలిస్ట్‌ ఇంటికి వెళ్లిన దుండగులు అతడిని అపహరించి...

Updated : 11 Nov 2020 04:51 IST

ప్రాణహాని ఉందని పోలీసులను ఆశ్రయించినా పట్టించుకోలేదని ఆరోపణలు

చెన్నై: తమిళనాడుకు చెందిన టీవీ జర్నలిస్ట్‌ దారుణ హత్యకు గురయ్యాడు. తమ అక్రమ దందాపై పోలీసులకు సమాచారం ఇచ్చాడనే నెపంతో జర్నలిస్ట్‌ ఇంటికి వెళ్లిన దుండగులు అతడిని అపహరించి, అనంతరం దారుణంగా హత్య చేశారు. కాంచీపురం జిల్లాకు చెందిన స్రావెల్‌ మోసెస్‌ (27) టీవీ జర్నలిస్ట్‌గా పనిచేస్తు్న్నాడు. అయితే ఓ మాఫియా గ్యాంగ్‌ స్థానికంగా ఉండే సరస్సు చుట్టూ భూమిని ఆక్రమిస్తూ విక్రయిస్తోంది. సదరు గ్యాంగ్‌ మాదకద్రవ్యాలను కూడా అమ్ముతోంది. అయితే తమ దందాపై పోలీసులకు సమాచారం ఇచ్చాడనే కోపంతో ఆదివారం జర్నలిస్ట్‌ ఇంటికి వెళ్లిన దుండగులు అతడిని బయటకు పిలిచి అపహరించారు. అనంతరం దారుణంగా హత్యచేశారు.

కాగా ఈ హత్య కేసుకు సంబంధించి నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే తన ప్రాణాలకు హాని ఉందని తమ కుమారుడు పోలీసులను ఆశ్రయించినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని జర్నలిస్ట్‌ తండ్రి జ్ఞానరాజ్‌ ఆరోపించారు. కాగా మృతుడి తండ్రి ఆరోపణలను పోలీసులు కొట్టివేశారు. మోసెస్‌ నుంచి మాకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పేర్కొన్నారు. వ్యక్తిగత కారణాలు, భూమికి సంబంధించిన కారణాలతోనే హత్య జరిగిందని పోలీసులు అన్నారు.

హత్య కేసులో పోలీసుల స్పందనపై సీనియర్‌ జర్నలిస్ట్ భారతి తమిళన్‌ తీవ్రంగా మండిపడ్డారు. ‘సోమన్‌గాలమ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గంజాయి విక్రయాలు, భూదందాపై పోలీసుకు తెలిపిన అనంతరం మోసెస్‌కు బెదిరింపులు ప్రారంభమయ్యాయి. అతడు పోలీసులను సంప్రదించినా వారు పట్టించుకోకపోవడంతోనే ఈ హత్య జరిగింది. రాష్ట్రంలో జర్నలిస్టులకు ఎలాంటి భద్రత లేకపోవడంతోనే వారిపై హత్యలు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని