Crime News: ఇంట్లో గంజాయి మొక్క.. పెరుగుతుందా లేదా..?

రాత్రి నిద్ర పట్టడం లేదు. ఎన్ని మందులు వాడినా ఫలితం లేదు.

Updated : 09 Nov 2021 08:12 IST

ప్రయోగం చేద్దామనుకొని చిక్కిన వైనం

ఈనాడు, హైదరాబాద్‌, జవహర్‌నగర్‌, న్యూస్‌టుడే: రాత్రి నిద్ర పట్టడం లేదు. ఎన్ని మందులు వాడినా ఫలితం లేదు. ఈ తరుణంలోనే ఎవరో చెబితే ఒక్కసారి గంజాయి తాగాడు. ఆ రోజు మంచిగా నిద్ర పట్టింది. తరువాత దానికి బానిసయ్యాడు. గంజాయి మొక్క మన వాతావరణంలో పెరుగుతుందా.. లేదా..? అంటూ ప్రయోగాలకు శ్రీకారం చుట్టి ఇప్పుడు జైలుకెళ్లాడు. జవహర్‌నగర్‌ ఠాణా పరిధిలోని యాప్రాల్‌లో ఇంట్లో పూల కుండీల్లో గంజాయి మొక్కలను పెంచుతూ ఆదివారం పిల్లోట్ల వెంకటనర్సింహాశాస్త్రి(53) పోలీసులకు చిక్కిన సంగతి విదితమే. విచారణలో అతను చెప్పిన సమాధానాలు దర్యాప్తు అధికారులు కంగుతిన్నారు. ‘ప్రశాంతంగా నిద్ర పోయేందుకే గంజాయి సేవించేవాడిని. అదీ కూడా రాత్రి భోజనం చేసిన తర్వాతే. నా బేకరీకొచ్చే ఓ వినియోగదారుడు చెబితేనే దీన్ని అలవాటు చేసుకున్నా’ అని పోలీసులకు వివరించాడు. ‘అప్పుడప్పుడు కొనుగోలు చేసిన గంజాయిలో అయిదారు విత్తనాలు కనిపిస్తే దాచి పెట్టా.  జులైలో మొదటి విత్తనం పెట్టా. అది మొలిచింది. దీంతో మిగిలిన వాటిని సెప్టెంబర్‌లో నాటాను. ఇంకో 15, 20 రోజులైతే పంట చేతికొచ్చేది. ఎవరికీ అమ్మాలనుకోలేదు. ఒకరిద్దరు స్నేహితులకు మాత్రం బహుమతిగా ఇవ్వాలనుకున్నా’ అని వివరించడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని