వాడటం రాదు, మీరే తీసుకోండి..

ఫోన్‌ను వాడటం తనకు చేతకావటం లేదని.. తిరిగిచ్చేస్తానని అతను చెప్పటంతో ఆశ్చర్యపోవటం యజమాని వంతయ్యింది.

Published : 09 Sep 2020 01:11 IST

ఫోన్‌ తిరిగిచ్చిన దొంగ

బుర్ద్వాన్‌: తన ఫోన్‌ను ఓ దుకాణంలో పోగొట్టుకున్న వ్యక్తికి.. దానిని దొంగిలించిన వ్యక్తే తిరిగి ఇచ్చేసిన సంఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది. అయితే తిరిగివ్వడానికి కారణం తనకు ఆ ఫోన్‌ను వాడటం రాకపోవటమే అని ఆ దొంగ పేర్కొనటం విచిత్రం. వివరాలు ఇలా ఉన్నాయి. తూర్పు బుద్వాన్‌ జిల్లా, జమాల్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తి రూ. 45,000 విలువ చేసే తన ఫోన్‌ను ఓ మిఠాయి దుకాణంలో పోగొట్టుకున్నాడు. వెంటనే తన నంబరుకు కాల్‌ చేయగా స్విచ్‌ ఆఫ్‌ అయినట్టు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది.

అయితే ఫోన్‌ యజమాని ఆశ కోల్పోకుండా మరల మరల కాల్‌ చేసేందుకు ప్రయత్నించాడు. కాగా, కొన్ని రోజుల అనంతరం దానిని దొంగిలించిన వ్యక్తి జవాబిచ్చాడు. అంతే కాకుండా ఆ ఫోన్‌ను వాడటం తనకు చేతకావటం లేదని.. తిరిగిచ్చేస్తానని అతను చెప్పటంతో ఆశ్చర్యపోవటం యజమాని వంతయ్యింది. అనంతరం దొంగిలించిన వ్యక్తి ఇంటి నుంచే పోలీసుల సహకారంతో తన ఫోనును తిరిగి తీసుకున్నాడు. దొంగిలించిన వ్యక్తి పశ్చాత్తాపం ప్రకటించటంతో.. ఫోన్‌ యజమాని విజ్ఞప్తి మేరకు పోలీసులు అతనిపై ఏ చర్య తీసుకోకపోవటం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని