ఈఎంఐలు కట్టలేక కుటుంబం ఆత్మహత్య!

ఆర్థిక ఇబ్బందులకు ఓ కుటుంబం బలైపోయింది! అప్పుల బాధలు తాళలేక అసోంలో తన భార్య, ముగ్గురు కుమార్తెలతో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కోక్రాఝర్‌లో...........

Published : 03 Nov 2020 00:49 IST

కుట్ర కోణం ఉందంటోన్న స్థానిక వ్యాపారులు

గువాహటి: ఆర్థిక ఇబ్బందులకు ఓ కుటుంబం బలైపోయింది! అప్పుల బాధలు తాళలేక అసోంలో తన భార్య, ముగ్గురు కుమార్తెలతో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కోక్రాఝర్‌లో కలకలం రేపింది. దీనిపై పోలీసులు తెలిపిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. నిర్మల్‌ పాల్‌ (45) అనే వ్యక్తి గ్యాస్‌ సబ్‌ ఏజెన్సీని నిర్వహిస్తుండేవాడు. అతడు బ్యాంకులు, స్థానిక వడ్డీ వ్యాపారుల నుంచి దాదాపు రూ.25 నుంచి 30లక్షల వరకు అప్పులు చేసినట్టు, గత కొద్ది నెలలుగా వాటికి ఈఎంఐలు కట్టలేకపోయారని పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే ఆదివారం వీరి మృతదేహాలను గ్రామంలోని వారి ఇంట్లో గుర్తించినట్టు తెలిపారు. మృతుల్లో నిర్మల్‌ పాల్‌ భార్య మల్లిక (40), కుమార్తెలు పూజ (25), నేహా (17), దీప (15) ఉన్నట్టు గుర్తించామని ఎస్పీ రాకేశ్‌ రౌషన్‌ తెలిపారు.

అయితే, ఈ ఘటనను ఆత్మహత్యగానే పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. నిర్మల్‌ పాల్‌ తుల్సిబిల్‌ మార్కెట్లో అతడు ఓ గ్యాస్‌ సబ్‌ ఏజెన్సీ నిర్వహిస్తున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. అతడి  పెద్ద కుమార్తె ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నట్టు గుర్తించామన్నారు. అక్కడ సూసైడ్‌ నోట్‌ లభ్యమైనప్పటికీ అందులో ఏం రాసి ఉందనేది ఇంకా తెలియలేదని ఓ అధికారి తెలిపారు. అయితే, ఈ ఘటన వెనుక కుట్ర కోణం ఉందని ఆల్‌ అస్సాం బెంగాలీ యుబ ఛత్రా ఫెడరేషన్‌ ఆరోపించింది. దీనిపై సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని డిమాండ్‌ చేసింది. స్థానిక పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.  ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని