నాలుగేళ్ల చిన్నారిని కడతేర్చిన తల్లి

భార్యాభర్తల మధ్య గొడవతో కన్నతల్లే కూతురును బావిలో పడేసి కడతేర్చిన ఘటన విజయనగరం జిల్లా డెంకాడ మండలం డి.తాళ్లవలస గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. తొమ్మిదేళ్ల క్రితం తాళ్లవలస గ్రామానికి చెందిన బంక శ్రీను, పూసపాటిరేగ మండలం వెంపడం గ్రామానికి మహాలక్ష్మితో

Published : 27 Jul 2020 01:41 IST

భర్త ఒత్తిడితో ఘాతుకానికి పాల్పడ్డ వైనం 

భోగాపురం(విజయనగరం): భార్యాభర్తల మధ్య గొడవతో కన్నతల్లే కూతురును బావిలో పడేసి కడతేర్చిన ఘటన విజయనగరం జిల్లా డెంకాడ మండలం డి.తాళ్లవలస గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. తొమ్మిదేళ్ల క్రితం తాళ్లవలస గ్రామానికి చెందిన బంక శ్రీను, పూసపాటిరేగ మండలం వెంపడం గ్రామానికి మహాలక్ష్మితో వివాహం అయింది. వీరికి ఇద్దరు కూతుర్లు. దంపతుల మధ్య తరచూ గొడవలు జరగడంతో శ్రీను తన భార్యను నాలుగేళ్ల క్రితం పుట్టింటికి పంపించాడు. తరువాత ఒకటి రెండు సార్లు మాత్రమే భార్యను పుట్టింటి వద్ద కలిశాడు. పెద్ద కూతురు, శ్రీను తాళ్లవలసలో ఉంటున్నారు. తరువాత మహాలక్ష్మి పుట్టింటి వద్ద గర్భం దాల్చి చిన్నకూతురు రమ్య(4)కు జన్మనిచ్చింది. అప్పటి నుంచి శ్రీను భార్యను అనుమానించడంతో గొడవలు మరింత ఎక్కువయ్యాయి. దీంతో భార్య పుట్టింటి వద్దే ఉంటూ వచ్చింది. ఇటీవల పదిరోజుల క్రితం పెద్దల సమక్షంలో జరిగిన ఒప్పందం మహాలక్ష్మి చిన్నకూతురు రమ్యను తీసుకొని తాళ్లవలసలోని భర్త వద్దకు వచ్చింది. వచ్చినప్పటి నుంచి చిన్నకూతురును వదిలించుకోవాలంటూ శ్రీను ఆమెపై ఒత్తిడి తెచ్చాడు.

దీంతో మహాలక్ష్మి తీవ్ర మనస్తాపం చెంది ఆదివారం తెల్లవారుజామున సుమారు 2గంటల సమయంలో రమ్యను తీసుకొని సమీపంలో ఉన్న తమ పొలంలోని బావి వద్దకు చేరకుంది. కూతురితో పాటు తాను బావిలో దూకాలని నిశ్చయించుకుంది. మొదట పాపను బావిలో పడేసింది. తరువాత కొంత సేపు పాప ఆర్తనాదాలు విని భయపడి తన ఆత్మహత్య నిర్ణయాన్ని విరమించుకుంది. తెల్లవారుజామున చిన్నారి రమ్య కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. ఆదివారం ఉదయం సుమారు 7గంటల సమయంలో సమీపంలోని బావిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. శ్రీను తండ్రి నారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బావిలో ఉన్న మృతదేహాన్ని బయటకు తీశారు. పోలీసుల విచారణలో మహాలక్ష్మి భర్త ఒత్తిడితో కూతురును తానే హతమార్చినట్లు ఒప్పుకుంది. శ్రీను, మహాలక్ష్మిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని