Crime News: పరీక్షల్లో ఫెయిలైనందుకు మందలించారని తల్లి, తమ్ముడి హత్య

పరీక్షల్లో ఉత్తీర్ణత కాలేదని మందలిస్తోందని కన్న తల్లినే హత్య చేసి, ఆమె లేకపోతే తమ్ముడు ఒంటరి అవుతాడని అతన్నీ గొంతుకోసి చంపేశాడు.. ఓ యువకుడు. ఈ దారుణ ఘటన తమిళనాట చోటుచేసుకుంది.

Updated : 23 Jun 2024 12:23 IST

తమిళనాట ఘటన.. యువకుడి అరెస్టు

చెన్నై, న్యూస్‌టుడే: పరీక్షల్లో ఉత్తీర్ణత కాలేదని మందలిస్తోందని కన్న తల్లినే హత్య చేసి, ఆమె లేకపోతే తమ్ముడు ఒంటరి అవుతాడని అతన్నీ గొంతుకోసి చంపేశాడు.. ఓ యువకుడు. ఈ దారుణ ఘటన తమిళనాట చోటుచేసుకుంది. చెన్నై తిరువొట్రియూర్‌ తిరునగర్‌కు చెందిన పద్మ(45) ఆక్యుపంక్చర్‌ వైద్యురాలు. ఆమె భర్త మురుగన్‌ ఒమన్‌లో డ్రైవర్‌గా పని చేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు నితీష్‌(20) బీఎస్సీ, సంజయ్‌(14) పదో తరగతి చదువుతున్నారు. నితీష్‌ శుక్రవారం రాత్రి తన పెద్దమ్మ కుమార్తె మహాలక్ష్మి ఇంటికి వెళ్లాడు. ఎవరికీ చెప్పకుండా అక్కడ ఓ సంచి వదిలేసి వెళ్లాడు. మహాలక్ష్మి రాత్రి ఆ సంచి లోపల చూడగా.. ఓ సెల్‌ఫోన్, ఇంటి తాళాలు ఉన్నాయి. సెల్‌ఫోన్‌ను ఆన్‌ చేసి చూడగా వాయిస్‌ మెసేజ్‌లు కనిపించాయి. వాటిలో ‘‘తాళాలు తీసుకొని ఇంటికి వెళ్లి చూడు’’ అని మాత్రమే ఉండటంతో వెంటనే ఆమె అక్కడికి వెళ్లారు. ఇంటి తాళాలు తీసి చూడగా.. పద్మ, సంజయ్‌ల మృతదేహాలు గోనెసంచిలో కనిపించాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు నితీష్‌ కోసం గాలించి, కాశిమేడు ఫిషింగ్‌ హార్బర్‌ వద్ద అరెస్టు చేశారు. ‘‘డిగ్రీ ఫెయిల్‌ అయ్యానని తల్లి తిట్టడంతో 2 నెలల కిందట ఇంటి నుంచి వెళ్లిపోయా. స్నేహితులు సర్ది చెప్పడంతో తిరిగొచ్చా. ఆ తర్వాత కూడా అమ్మ తిడుతూనే ఉంది. దీంతో 19న రాత్రి హత్య చేశా. తమ్ముడు ఒంటరి వాడవుతాడని అతన్నీ గొంతు కోసి చంపేశా’ అని నిందితుడు పోలీసులకు చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని