
AP News: రూ.20కోట్ల చిట్టీలు కట్టించిన మహిళ.. అర్ధరాత్రి పరారీకి యత్నం!
అనంతపురం: చిట్టీల పేరుతో అనంతరపురంలో ఓ మహిళ సుమారు వంద మందిని బురిడీ కొట్టించింది. దాదాపు రూ.20 కోట్ల వసూలు చేసి మోసం చేసింది. అనంతపురం నగరంలోని విద్యుత్ నగర్‌కు చెందిన జయలక్ష్మి బ్యూటీ పార్లర్ నడుపుతూ స్థానికంగా చిట్టీలు నిర్వహిస్తోంది. ఇరుగుపొరుగున ఉండే వాళ్లు ఆమెను నమ్మి చిట్టీలు కట్టారు. అయితే కొన్నాళ్లుగా ఆమె వారికి డబ్బులివ్వకుండా తప్పించుకొని తిరుగుతోంది. ఇదే క్రమంలో నిన్న అర్ధరాత్రి ఇంటిని ఖాళీ చేసి వెళ్తుండగా బాధితులు వెంబడించి పట్టుకొని ఇటుకలపల్లి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.
స్థానిక ఎస్సై జయలక్ష్మికి వత్తాసు పలుకుతూ ఆమెను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని బాధిత మహిళలు ఆరోపించారు. న్యాయం చేయమని అడిగితే ఎవరిని అడిగి చిట్టీలు వేశారని మండిపడుతున్నారని చెబుతున్నారు. ఎస్సై రాఘవరెడ్డికి తీరుకు నిరసనగా స్టేషన్ బయట బైఠాయించి మహిళలు ఆందోళన చేశారు. ఇది సివిల్ కేసు కావడంతో బాధితులు ఆధారాలతో కోర్టుకు వెళ్లాలని పోలీసులు సూచించారు. మరోవైపు జయలక్ష్మిపై అనంతపురంలోని పలు స్టేష్లన్లలో ఇప్పటికే ఎనిమిది చెక్ బౌన్స్‌లతో పాటు ఇతర కేసులున్నట్లు సమాచారం.