Warangal: లింగనిర్ధరణ చేసి గర్భస్రావాలు.. 18 మంది అరెస్టు

లింగనిర్ధరణ ద్వారా గర్భస్రావాలు చేస్తున్న 18 మంది అరెస్టయ్యారు. వారి నుంచి 18 సెల్‌ఫోన్లు, ₹73వేలు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ రంగనాథ్‌ తెలిపారు.

Updated : 29 May 2023 14:44 IST

వరంగల్‌: లింగనిర్ధరణ ద్వారా గర్భస్రావాలు చేస్తున్న 18 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వరంగల్‌ జిల్లా నర్సంపేట కేంద్రంగా జరుగుతున్న ఈ వ్యవహారంపై సీపీ రంగనాథ్‌ వివరాలను వెల్లడించారు. నిందితుల నుంచి 18 సెల్‌ఫోన్లు, రూ.73వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు.  

‘‘నర్సంపేట కేంద్రంగా పెద్ద ఎత్తున లింగనిర్ధరణ పరీక్షల దందా సాగుతోంది. లోటస్‌ ఆస్పత్రి యజమాని, వైద్యులను అరెస్టు చేశాం. స్కానింగ్‌ సామగ్రిని స్వాధీనం చేసుకున్నాం. ఆయుర్వేద వైద్యులు కూడా గర్భస్రావాలు చేస్తున్నారు. బాధ్యులైన వైద్యులు, సిబ్బంది అందరినీ పట్టుకున్నాం. ఈ విషయంపై వైద్యశాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తాం’’ అని సీపీ రంగనాథ్‌ చెప్పారు.

ఒక్కొక్కరి నుంచి రూ.30వేల నుంచి రూ.50వేలు వసూలు

నర్సంపేటకు చెందిన ప్రముఖ మహిళా వైద్యురాలు, నెక్కొండకు చెందిన ఒక వైద్యుడితోపాటు స్కానింగ్‌ కేంద్రాల నిర్వాహకులు, ఏజెంట్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో పలు విషయాలు వెలుగు చూశాయి. నర్సంపేట, నెక్కొండ, హనుమకొండ, వరంగల్‌ తదితర ప్రాంతాల్లో గర్భస్రావాలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఒక్కొక్కరి నుంచి రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నట్లు విచారణలో తేలింది. ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని గ్రామీణ ప్రాంతాల నుంచి గర్భిణులను లింగనిర్ధరణ పరీక్షల కోసం నగరానికి తీసుకొస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. సుమారు 200 మందికి అబార్షన్లు చేయించి ఉంటారని.. ఈ మేరకు విచారణలో వెల్లడైందని తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని