Cash in pipeline: ఆ ఇంటి పైప్‌లైన్‌లో నోట్ల కట్టలు.. ఏసీబీ అధికారుల షాక్..‌!

తమ అక్రమార్జనను కొందరు అధికారులు, రాజకీయ నేతలు తమ ఇంటి గోడల్లోనో, బాత్‌రూమ్‌ల్లోనో దాచి ఉంచడం మనం తరచూ సినిమాల్లో చూస్తుంటాం. కానీ, ఇది అంతకుమించి..! కర్ణాటకలో...

Updated : 25 Nov 2021 13:08 IST

బెంగళూరు: తమ అక్రమార్జనను కొందరు అధికారులు, రాజకీయ నేతలు తమ ఇంటి గోడల్లోనో, బాత్‌రూమ్‌ల్లోనో దాచి ఉంచడం మనం తరచూ సినిమాల్లో చూస్తుంటాం. కానీ, ఇది అంతకుమించి..! కర్ణాటకలో పీడబ్ల్యూడీ జాయింట్‌ ఇంజినీర్‌ తన సొమ్మును బ్యాంకులోనో, బీరువాలోనో కాకుండా.. తన ఇంటి పైప్‌లైన్‌లో దాచి ఉంచడం చూసి ఏసీబీ అధికారులు బిత్తరపోయారు. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలో ఆదాయానికి మించిన ఆస్తుల కూడబెట్టారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు అధికారుల ఇళ్లల్లో ఏసీబీ సోదాలు జరపగా ఈ భారీ అవినీతి తిమింగళం పట్టుబడింది. కలబురిగి జిల్లా పీడబ్ల్యూడీ జాయింట్‌ ఇంజినీర్‌ శాంతా గౌడ్‌ బిరదర్‌ ఇంట్లో సోదాలు చేసిన అధికారులు అతడి అక్రమ సంపాదన చూసి షాకయ్యారు. ఈ సోదాల్లో ఆయన ఇంట్లో ₹25 లక్షల నగదు, పెద్ద మొత్తం బంగారం స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. 

శాంతాగౌడ్‌ తన ఇంట్లో ఉన్న పైప్‌లైన్‌లో నగదు దాచి ఉంచాడన్న సమాచారం అందుకున్న అధికారులు.. ఓ ప్లంబర్‌ను తీసుకొచ్చి వాటిని తీయించారు. దీంతో పైపులైన్‌ నుంచి కరెన్సీ నోట్లు కిందకు పడటం చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఆయన ఇంట్లో సోదాలను వీడియోలో చిత్రీకరించారు. నల్ల ధనం కోసమే ఈ పైపులను ఇంట్లో ఆయన ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్టు గుర్తించారు.

ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 15 మంది అధికారులకు సంబంధించి ఏసీబీ అధికారులు 60 చోట్ల సోదాలు చేశారు. ఇటీవలే బెంగళూరు డెవలప్‌మెంట్‌ అథారిటీ కార్యాలయంలోనూ సోదాలు జరిపింది. ఏ రూపంలో అవినీతికి పాల్పడినా సహించేది లేదని ఇటీవలే సీఎం బసవరాజ బొమ్మై స్పష్టంచేశారు. అవినీతిపరుల్ని ఉపేక్షించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఏసీబీ సమర్పించిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు.

అధికారి ఇంట్లో స్వాధీనం చేసుకున్న బంగారం, డబ్బు


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని