crime news: హైదరాబాద్‌-శ్రీశైలం రహదారిపై ఘోర ప్రమాదం: ఏడుగురి మృతి

హైదరాబాద్‌- శ్రీశైలం జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. ఉప్పునుంతల మండలం చెన్నారం గేట్‌ వద్ద రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో

Updated : 23 Jul 2021 23:22 IST

నాగర్‌ కర్నూలు: హైదరాబాద్‌- శ్రీశైలం జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. నాగర్‌ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం చెన్నారం గేట్‌ వద్ద రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో శ్రీశైలం నుంచి హైదరాబాద్‌ వెళ్లే కారులో ఉన్న ముగ్గురు, హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం వైపు వెళ్లే కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు గాయపడినట్టు  డీఎస్పీ నర్సింహులు తెలిపారు. రోడ్డు ప్రమాదం ధాటికి రెండు కార్లు నుజ్జునుజ్జయ్యాయి. ఘటనా స్థలంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. మరి కొన్ని మృతదేహాలు కార్లలో చిక్కుకున్నాయి. అతివేగమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన ఒకరిని అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటి వరకు మృతుల్లో నలుగురి వివరాలను పోలీసులు సేకరించారు. వంశీ(జీడిమెట్ల), వెంకట్‌ (నిజాంపేట), నరేశ్‌ (పటాన్‌ చెరు), శివకుమార్‌ (ఆనంద్‌బాగ్‌)గా గుర్తించారు.

హైదరాబాద్‌- శ్రీశైలం రహదారిపై చెన్నారం గేటు వద్ద వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో రెండు కార్లు అతివేగంతో ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని పోలీసులు వెల్లడించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని  సహాయక చర్యలు చేపట్టారు. చీకటి పడటంతో సహాయక చర్యలకు ఆటంకమేర్పడింది. సాధ్యమైనంత తర్వగా కార్లలో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీసి అచ్చంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శర్మన్‌, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదానికి గురైన కార్లలో ఒకటి హైదరాబాద్‌కు చెందిన వారిదిగా గుర్తించారు. మృతుల వివరాలు సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మృతదేహాల వద్ద లభ్యమైన గుర్తింపు కార్డులు, కారు నంబర్ల ఆధారంగా మృతుల బంధువులకు పోలీసులు సమాచారమందిస్తున్నారు.

మృతుల కుటుంబాలకు సాయం ప్రకటించిన ప్రధాని
నాగర్‌కర్నూల్‌ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపిన ప్రధాని.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు ట్విటర్‌లో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50వేలు పరిహారం ప్రకటించారు.

ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి

నాగర్‌ కర్నూలు ప్రమాద ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వ్యక్తికి మెరుగైన వైద్యసేవలు అందించేలా చూడాలని సీఎం ఆదేశించారు. ప్రమాద ఘటనపై అచ్చంపేట ఎమ్మెల్యే బాలరాజును అడిగి వివరాలు తెలుసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని