
న్యాయవాదుల హత్య: కస్టడీకి నిందితులు
మంథని: పెద్దపల్లి జిల్లాలో జరిగిన హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు (49), నాగమణి (45) హత్యకేసులో విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న కుంట శ్రీనుతో పాటు మరో ఇద్దరిని కస్టడీకి కోరుతూ డీసీపీ రవీందర్ మంథని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన మంథని న్యాయస్థానం.. నిందితులు కుంట శ్రీను, చిరంజీవి, కుమార్‌లను వారం రోజులపాటు కస్టడీకి తీసుకునేందుకు పోలీసులకు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం నిందితులు వరంగల్ కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్నారు. కోర్టు అనుమతి మేరకు నిందితులను అదుపులోకి తీసుకుని లోతుగా విచారిస్తే కేసుకు సంబంధించి మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల వద్ద గట్టు వామన్‌రావు, నాగమణి దంపతులు దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. కారులో హైదరాబాద్ వస్తుండగా మంథని-పెద్దపల్లి ప్రధాన రహదారిపై పట్టపగలే నరికి చంపేశారు.