Suicide: మహిళా వాలంటీర్‌ హత్య కేసు నిందితుడు పద్మారావు ఆత్మహత్య

బాపట్ల జిల్లా వేమూరు మండలంలోని చావలి గ్రామంలో వాలంటీర్‌ శారద(30) హత్య కేసులో నిందితుడిగా ఉన్న పద్మారావు ఆత్మహత్య చేసుకున్నాడు.

Updated : 19 May 2022 13:58 IST

వేమూరు: బాపట్ల జిల్లా వేమూరు మండలంలోని చావలి గ్రామంలో వాలంటీర్‌ శారద(30) హత్య కేసులో నిందితుడిగా ఉన్న పద్మారావు ఆత్మహత్య చేసుకున్నాడు. పొన్నూరు పట్టణంలోని నిడుబ్రోలు రైల్వేస్టేషన్‌లో పద్మారావు(35) తిరుపతి నుంచి విశాఖ వెళ్తున్న డబుల్ డెక్కర్ రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఘటన జరిగింది. అతని జేబులో ఉన్న కార్డుల ఆధారంగా కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న కుటుంబీకులు ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి పద్మారావుగా గుర్తించారు. వాలంటీర్‌ హత్యకు సంబంధించి మనస్తాపంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

అసలేం జరిగిందంటే..

చావలి గ్రామానికి చెందిన శారదను అదే గ్రామానికి చెందిన వ్యక్తికి ఇచ్చి 2008లో వివాహం చేశారు. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. శారద స్థానికంగా వాలంటీర్‌గా పనిచేసేది. అదే గ్రామానికి చెందిన ఎం.పద్మారావుతో ఆమెకు నాలుగేళ్ల క్రితం ఏర్పడిన పరిచయం సాన్నిహిత్యానికి దారితీసింది. ఆరు నెలల క్రితం ఆమె ప్రవర్తనను అనుమానించిన పద్మారావు సచివాలయం వద్ద ఆమెపై చేయి చేసుకున్నాడు. ఆ విషయంపై అప్పట్లో సచివాలయం మహిళా పోలీస్‌ వేమూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా, అతన్ని మందలించి వదిలేశారు. ఈ నేపథ్యంలో శారదపై ద్వేషం పెంచుకున్న పద్మారావు ఈ నెల 15న సాయంత్రం ఆమె ఇంటి ముందు శుభ్రం చేస్తున్న సమయంలో కత్తితో దాడి చేశాడు. తప్పించుకోబోయిన ఆమెను కొద్దిదూరం వెంటబడి మెడపై కోసి ద్విచక్ర వాహనంపై పరారయ్యాడు. ఆమె ఘటనాస్థలంలోనే మృతి చెందింది. ఈ ఘటన తర్వాత పద్మారావు పరారీలో ఉన్నాడు. ఈ తెల్లవారుజామున రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని