
థన్‌బర్గ్ టూల్‌కిట్ కేసులో తొలి అరెస్ట్
దిశ రవిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
దిల్లీ: బెంగళూరుకు చెందిన దిశ రవి అనే యువ పర్యావరణ పరిరక్షకురాలిని దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు ఆదివారం వెల్లడించారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు మద్దతు తెలిపేందుకు రూపొందించిన ‘టూల్‌కిట్’ను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసినందుకుగానూ ఆమెను అరెస్టు చేసినట్లు తెలిపారు. ‘ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్’ పేరిట పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వారిలో దిశ రవి ఒకరు.
స్వీడన్‌కు చెందిన పర్యావరణ ప్రేమికురాలు గ్రేటా థన్‌బర్గ్ సహా పలువురు ప్రముఖులు షేర్ చేయడంతో ఈ టూల్‌కిట్ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. రైతుల ఆందోళనకు మద్దతు తెలిపేందుకు ఉన్న వివిధ మార్గాలను సూచిస్తూ గూగుల్ డాక్యుమెంట్ సృష్టించారు. దీనికి టూల్‌కిట్‌గా నామకరణం చేశారు. అయితే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఖలిస్థాన్ వేర్పాటువాదులే దీన్ని రూపొందించారన్న ఆరోపణలు ఉన్నాయి. దీని వెనుక ఖలిస్థాన్ అనుకూల సంస్థ ‘పొయెటిక్ జస్టిస్ ఫౌండేషన్’ హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో గుర్తుతెలియని వ్యక్తులపై దిల్లీ పోలీసులు దేశద్రోహం, ప్రభుత్వంపై కుట్రకు సంబంధించిన పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆ కేసు విచారణలో భాగంగానే తాజాగా దిశ రవిని అదుపులోకి తీసుకున్నారు.
దేశంలో వివిధ వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, ప్రభుత్వంపై వ్యతిరేకతను సృష్టించడమే లక్ష్యంగా టూల్‌కిట్‌ను రూపొందించినట్లు పోలీసులు భావిస్తున్నారు. జనవరి 26న ఎర్రకోటపై ఇతర జెండాల ఎగురవేత, సామాజిక మాధ్యమాల్లో హ్యాష్‌ట్యాగ్ ద్వారా డిజిటల్ స్ట్రైక్, భౌతిక దాడులకు సంబంధించిన ప్రస్తావన టూల్‌కిట్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు ఈ కేసును తీవ్రంగా పరిగణిస్తున్నారు.
ఇవీ చదవండి...