Rajtharun: సినీనటుడు రాజ్‌తరుణ్‌పై యువతి ఫిర్యాదు

తనతో సహజీవనం సాగిస్తున్న సినీ నటుడు రాజ్‌తరుణ్‌ మరో మహిళకు దగ్గరై తనను బెదిరిస్తున్నాడంటూ లావణ్య అనే యువతి శుక్రవారం నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Updated : 06 Jul 2024 08:56 IST

11 ఏళ్లుగా సహజీవనం..పెళ్లి చేసుకోమంటే బెదిరింపులు

నార్సింగి న్యూస్‌టుడే: తనతో సహజీవనం సాగిస్తున్న సినీ నటుడు రాజ్‌తరుణ్‌ మరో మహిళకు దగ్గరై తనను బెదిరిస్తున్నాడంటూ లావణ్య అనే యువతి శుక్రవారం నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందులోని వివరాల మేరకు.. కోకాపేటలోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న లావణ్య 11 ఏళ్లుగా రాజ్‌తరుణ్‌తో సహజీవనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం పోలీస్‌స్టేషన్‌కు చేరింది. ఇటీవల కొత్తగా సినీ రంగానికి వచ్చిన ఓ నటితో రాజ్‌తరుణ్‌ సంబంధం ఏర్పరచుకొని తనను దూరంగా ఉంచినట్లు లావణ్య వివరించారు. త్వరలో తాము పెళ్లి కూడా చేసుకోబోతున్నామని పేర్కొన్నారు. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. బాధితురాలి ఫిర్యాదుమేరకు దర్యాప్తు చేస్తున్నట్లు నార్సింగి ఇన్‌స్పెక్టర్‌ హరికృష్ణారెడ్డి తెలిపారు.

సహజీవనం చేశాం.. బెదిరింపులు అవాస్తవం: రాజ్‌తరుణ్‌

తనపై లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సినీనటుడు రాజ్‌తరుణ్‌ మీడియాతో మాట్లాడారు. సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమైన లావణ్య హైదరాబాద్‌ వచ్చినపుడు దగ్గరైందని, తామిద్దరం సహజీవనం చేసిన మాట నిజమేనని తెలిపారు. కానీ గతంలో ఆమె డ్రగ్స్‌తో పట్టుబడి అరెస్టైందని, ఆమెను కేసులో ఇరికించినట్లు వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామన్న మాటలు అవాస్తవమేనని అన్నారు. తాము పోలీసులకు ఫిర్యాదు చేస్తామని, వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని