Adibatla kidnap case: యువతి కిడ్నాప్‌ కేసు.. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు

మన్నెగూడలో యువతి కిడ్నాప్ కేసుకు సంబంధించి తాజాగా పోలీసులు రిమాండ్ రిపోర్టును విడుదల చేశారు. ఈ రిపోర్టులో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.

Updated : 13 Dec 2022 16:47 IST

హైదరాబాద్‌: ప్రేమించిన అమ్మాయి మరొకరితో పెళ్లికి సిద్ధపడిందని ఆ యువతిని ప్రియుడు అపహరించుకుపోయిన సంఘటన రాష్ట్ర రాజధాని శివారు మన్నెగూడలో ఈ నెల 9వ తేదీన కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసుకు సంబంధించి పోలీసులు విడుదల చేసిన రిమాండ్ రిపోర్టులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

‘‘గతేడాది బొంగులూరులోని స్పోర్ట్స్‌ అకాడమీలో వైశాలికి నవీన్‌తో పరిచయం ఏర్పడింది. నవీన్‌.. వైశాలి ఫోన్ నంబర్‌ తీసుకొని తరచూ కాల్స్‌, మెసేజ్‌లు చేసేవాడు. ఆమెతో కలిసి ఫొటోలు తీసుకొని పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. తల్లిదండ్రులు అంగీకరిస్తే పెళ్లి చేసుకుంటానని ఆమె చెప్పింది. వైశాలి తల్లిదండ్రులను ఒప్పించేందుకు నవీన్‌ ప్రయత్నించాడు. వారు పెళ్లికి అంగీకరించకపోవడంతో నవీన్‌రెడ్డి కక్ష పెంచుకున్నాడు. వైశాలి పేరుతో నకిలీ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా తెరిచాడు. ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలను వైరల్‌ చేశాడు. 6 నెలల క్రితం యువతి ఇంటి ముందు స్థలాన్ని నవీన్‌ లీజుకు తీసుకున్నాడు. గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా నవీన్‌, అతని స్నేహితులు యువతి ఇంటి ముందు అలజడి సృష్టించారు. దీంతో యువతి ఫిర్యాదు మేరకు నవీన్‌పై పలు సెక్షన్ల కింద ఆదిభట్ల పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ నెల 9న వైశాలికి జరిగిన నిశ్చితార్థం గురించి నవీన్‌ తెలుసుకున్నాడు. యువతిని అపహరించి పెళ్లి చేసుకోవాలని కుట్ర పన్నాడు. అనుచరులు, టీ స్టాళ్లలో పనిచేసే సిబ్బందిని ఇందుకోసం ఉపయోగించుకున్నాడు. ఇంటి ముందు నిలిపిన 5 కార్ల అద్దాలను ధ్వంసం చేశారు. యువతి ఇంట్లో సామగ్రి ధ్వంసం చేసి సీసీ కెమెరాలు, డీవీఆర్‌లు ఎత్తుకెళ్లారు. వైశాలిని అపహరించి కారులో నల్గొండవైపు తీసుకెళ్లారు. తన కోసం పోలీసులు వెతుకుతున్నారనే విషయాన్ని నవీన్ సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్నాడు. నల్గొండ వద్ద నవీన్‌రెడ్డి, అతడి స్నేహితులు కారు నుంచి దిగిపోయారు. నవీన్‌ మరో స్నేహితుడు రుమాన్‌.. వోల్వో కారులో వైశాలిని హైదరాబాద్‌ తీసుకొచ్చాడు. ఈ నెల 9న సాయంత్రం క్షేమంగా ఉన్నట్లు వైశాలి.. తన తండ్రికి ఫోన్ చేసి చెప్పింది. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద ఆదిభట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. అపహరణ కేసులో ఇప్పటివరకు 32 మందిని అరెస్టు చేశాం. ఈ కేసులో ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డి, మరో ముగ్గురి కోసం గాలిస్తున్నాం’’ అని రిమాండ్ రిపోర్టులో పోలీసులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని