Land Grabbing: ఎన్‌ఆర్‌ఐకు చెందిన ₹కోట్లు విలువ చేసే స్థలాన్ని కొట్టేసిన పోలీస్‌.. లాయర్‌!

చట్టాన్ని కాపాడాల్సిన పోలీసు, ఓ న్యాయవాదే తప్పుదోవపట్టారు తప్పుదోవపట్టారు. అధికార దుర్వినియోగానికి పాల్పడి ఓ ఎన్‌ఆర్‌ఐకి చెందిన రూ. కోట్లు విలువ చేసే స్థలాన్ని ఆక్రమించారు. ఈ ఇద్దరితోపాటు మరో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Published : 28 Sep 2023 01:24 IST

గురుగ్రామ్‌: చట్టాన్ని కాపాడాల్సిన పోలీసు, ఓ న్యాయవాదే తప్పుదోవపట్టారు. అధికార దుర్వినియోగానికి పాల్పడి ఓ ఎన్‌ఆర్‌ఐకి చెందిన రూ. కోట్లు విలువ చేసే స్థలాన్ని సొంతం చేసుకునేందుకు ప్రయత్నించారు. యజమాని ఫిర్యాదుతో ఓ ఏఎస్‌ఐ, న్యాయవాదితోపాటు మరో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ఘటన హరియాణాలోని గురుగ్రామ్‌లో చోటు చేసుకుంది. 

తొడాపూర్‌కు చెందిన సుభాష్‌ చంద్‌ అతడి అల్లుడు, న్యాయవాది అయిన టోనీ యాదవ్‌ కొన్నాళ్ల కిందట ఓ ఎన్‌ఆర్‌ఐకు చెందిన స్థలంపై కన్నేశారు. అతడు విదేశంలో నివసిస్తుండటంతో ఆ స్థలాన్ని దక్కించుకునేందుకు పథకం పన్నారు. కల్కాజీ ప్రాంత తహసీల్దార్‌ కార్యాలయంలో పనిచేసే సంజయ్‌ గోస్వామిని, గురుగ్రామ్‌లో ఏఎస్‌ఐ పనిచేస్తోన్న ప్రదీప్‌ను, భీమ్‌సింగ్‌ అనే మరో వ్యక్తిని తమ పథకంలో భాగస్వాములను చేసుకున్నారు. సంజయ్‌తో భూరికార్డ్స్‌లో మార్పులు చేయించారు. రూ.40 కోట్లు విలువ చేసే ఆ భూమికి ఎన్‌ఆర్‌ఐ కొన్నేళ్ల కిందటే ఓ వ్యక్తిని పవర్‌ ఆఫ్‌ అటార్నీగా నియమించినట్లు.. అతడి నుంచి రూ.6.60 కోట్లు పెట్టి ఆ స్థలాన్ని కొనుగోలు చేసినట్లు నకిలీ దస్తావేజులు సృష్టించారు. 2001లోనే హెలికాప్టర్‌ ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి సంతకాన్ని, సందీప్‌ అనే మరో న్యాయవాది సంతకాన్ని టోనీ యాదవ్‌ ఫోర్జరీ చేసి సాక్షి సంతకాలు పెట్టాడు. ఈ అక్రమానికి ఏఎస్‌ఐ ప్రదీప్‌ సహకరించారు. 

ఈ విషయం తెలుసుకున్న స్థల యజమాని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)తో విచారణ చేయించి.. నిందితులను అరెస్ట్‌ చేశారు. తాజాగా కోర్టులో హాజరుపర్చి జ్యూడిషియల్‌ కస్టడీకి పంపించారు. పోలీసులు ఇలాంటి అవినీతికి పాల్పడితే ఉపేక్షించేది లేదని గురుగ్రామ్‌ పోలీస్‌ కమిషనర్‌ స్పష్టం చేశారు. నిందితుల్లో ఒకరైన పోలీసుపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని