Aaftab: శ్రద్ధాను కిరాతకంగా చంపి.. ఇతర అమ్మాయిలతో డేటింగ్‌ చేసి..!

శ్రద్ధా వాకర్‌ (Shraddha Walkar) హత్య కేసుకు సంబంధించి పోలీసులు దాఖలు చేసిన 6వేల పేజీల ఛార్జిషీట్‌లో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Updated : 07 Feb 2023 21:47 IST

దిల్లీ: శ్రద్ధావాకర్‌ (Shraddha Walkar) హత్యకేసు దర్యాప్తులో ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. శ్రద్ధాను చంపిన తర్వాత ఆమె శరీర భాగాలను ముక్కులుగా కోసిన ఆఫ్తాబ్‌ పూనావాలా (Aaftab Poonawala).. వాటిని పలు ప్రదేశాల్లో విసిరేసినట్లు ఇప్పటికే తేలింది. అయితే, వాటిలో కొన్నింటి ఎముకలను నేరుగా కాకుండా రోలుతో పొడిగా చేసి పడేసినట్లు మొదట చెప్పినప్పటికీ.. అవన్నీ పోలీసులను తప్పుదోవ పట్టించేందుకేనని వెల్లడైంది. అయితే, చిట్ట చివరగా ఆమె తలను మాత్రం మూడు నెలల తర్వాత బయట పడేసినట్లు దిల్లీ పోలీసులు వెల్లడించారు. అంతేకాకుండా శ్రద్ధాను చంపిన అనంతరం మే 18న ఆన్‌లైన్‌లో చికెన్‌ రోల్‌ను ఆర్డర్‌ చేసుకొని తిన్నట్లు ఇటీవల దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో పోలీసులు పేర్కొన్నారు.

చాలామంది గర్ల్‌ఫ్రెండ్స్‌..

ఆఫ్తాబ్‌ పూనావాలా, శ్రద్ధా వాకర్‌లు దిల్లీలో మకాం పెట్టిన తర్వాత వారిద్దరి మధ్య పలు విషయాల్లో తగాదాలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఖర్చులు, ఇతర మహిళలతో ఆఫ్తాబ్‌కు పరిచయం వంటి విషయాల్లో వీరిద్దరి మధ్య గొడవలు జరిగేవి. ఆఫ్తాబ్‌కు దిల్లీ నుంచి దుబాయ్‌ వరకు ఎంతో మంది గర్ల్‌ఫ్రెండ్స్‌ ఉన్నారు. మే 18న ఇద్దరు కలిసి ముంబయికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే, చివరి నిమిషంలో ఆఫ్తాబ్‌ టికెట్‌ రద్దయ్యింది. వారిద్దరి మధ్య మరోసారి తగాదాకు ఇది కూడా కారణమయ్యింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడం.. ఆ సమయంలో శ్రద్ధాను ఆఫ్తాబ్‌ గొంతుకోసి చంపేశాడు’ అని దిల్లీ పోలీసులు తమ ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు.

ప్లాస్టిక్‌ బ్యాగును కొని..

తొలుత శ్రద్ధా శరీరాన్ని ప్లాస్టిక్‌ బ్యాగులో వేసుకొని బయటపడేయాలని అనుకున్నాడు. ఇందుకోసం బ్యాగును కూడా తీసుకువచ్చాడు. అలా చేస్తే వెంటనే దొరికిపోతానని భావించిన ఆఫ్తాబ్‌.. మృతదేహాన్ని ముక్కలుగా కోసి పడేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం రంపం, సుత్తె, మూడు కత్తులు కొనుగోలు చేశాడు. వేళ్లను వేరు చేసేందుకు ప్రత్యేకంగా వేడి యంత్రాన్ని (Blow Torch) కూడా కొన్నాడు. మరుసటి రోజు కొత్త ఫ్రిజ్‌ ఖరీదు చేశాడు. అనంతరం నాలుగు రోజుల్లో మృతదేహాన్ని 17 భాగాలు చేసి చేసి ఫ్రిజ్‌లో పెట్టాడు. అయితే, తర్వాత అతడు వేరే అమ్మాయిలో డేటింగ్‌ చేశాడు. వారు ఇంటికి వచ్చిన సమయంలో ఫ్రిజ్‌లో నుంచి వాటిని తీసి కిచెన్‌లో దాచిపెట్టేవాడు.

ఇంకా దొరకని తల..

మే 18న శ్రద్ధాను చంపిన తర్వాత కూడా ఆమె గూగుల్‌ అకౌంట్‌ను ఉపయోగించినట్లు వెల్లడైంది. కొన్ని రోజుల తర్వాత సెల్‌ఫోన్‌తోపాటు ఆమె లిప్‌స్టిక్‌ను ముంబయిలో పడేసినట్లు దిల్లీ పోలీసులు దాఖలు చేసిన 6వేల పేజీల ఛార్జిషీట్‌లో వెల్లడించారు. ఇప్పటివరకు 20 శరీర ముక్కలను స్వాధీనం చేసుకోగా.. తల మాత్రం ఇంకా లభించక పోవడం గమనార్హం. ఈ కేసులో ఆఫ్తాబ్‌కు ఇప్పటికే పాలిగ్రఫీ, నార్కో పరీక్షలు కూడా పూర్తికాగా.. అందులో నేరాన్ని అంగీకరించాడు. అయినప్పటికీ బలమైన సాక్ష్యాధారాలను న్యాయస్థానం ముందు ఉంచేందుకు దర్యాప్తు అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని