కేజిన్నర బంగారం చేతులకు చుట్టుకుని.. కస్టమ్స్‌కు చిక్కిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ ఉద్యోగి!

Air India Express- smuggling: సాధారణంగా ఇతర దేశాల నుంచి ప్రయాణికులు బంగారాన్ని దేశంలోకి అక్రమంగా తరలించిన ఘటనలు తరచూ చూస్తుంటాం. తాజాగా ఓ విమానయాన సంస్థకు చెందిన ఉద్యోగే స్మగ్లింగ్‌కు పాల్పడిన ఘటన వెలుగుచూసింది.

Updated : 09 Mar 2023 13:19 IST

కోచి: ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ (Air India Express)కు చెందిన ఓ ఉద్యోగి దాపు కేజిన్నర బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ కస్టమ్స్‌ అధికారుల చేతికి చిక్కాడు. ఆ బంగారాన్ని తన చేతులకు చుట్టుకుని స్మగ్లింగ్‌ (smuggling) చేసేందుకు ప్రయత్నించగా.. అధికారులు అతడిని పట్టుకున్నారు. కేరళలోని కొచ్చిన్‌ (Cochin) అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది.

బహ్రెయిన్‌ నుంచి కోజికోడ్‌ మీదుగా ఓ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ (Air India Express) విమానం కోచి ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ఆ విమానంలో కేబిన్‌ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న షఫీ అనే వ్యక్తి.. బంగారాన్ని స్మగ్లింగ్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు కస్టమ్స్‌ ప్రివెంటివ్‌ కమిషనరేట్‌కు రహస్య సమాచారం అందింది. దీంతో కస్టమ్స్‌ అధికారులు అతడిపై నిఘా పెట్టారు. ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండ్‌ అయిన తర్వాత గ్రీన్‌ ఛానల్‌ నుంచి హడావుడిగా వెళ్తున్న షఫీని పట్టుకోగా.. ఈ స్మగ్లింగ్‌ వ్యవహారం బయటపడింది. పేస్ట్‌ రూపంలో ఉన్న 1487 గ్రాముల బంగారాన్ని షఫీ తన రెండు చేతులకు చుట్టుకున్నాడు. అది బయటకు కనిపించకుండా స్లీవ్స్‌ను కప్పి ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఆ బంగారం విలువ దాదాపు రూ.75 లక్షలు ఉంటుందని వెల్లడించారు.

ఈ ఘటనపై ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ ఉద్యోగిని తక్షణమే సస్పెండ్‌ చేసినట్లు తెలిపింది. ‘‘అలాంటి ప్రవర్తనను మా సంస్థ ఎన్నటికీ సహించబోదు. దర్యాప్తు నివేదిక వచ్చిన తర్వాత ఆ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే విధుల నుంచి తొలగించేందుకు కూడా వెనుకాడబోం’’ అని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ ఆ ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం ఈ ఘటనపై కస్టమ్స్‌ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని