Ankita Bhandari murder case: అంకితా భండారీ హత్య కేసులో నిందితులకు నార్కోపరీక్షలు..!

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అంకితా భండారీ హత్య కేసులో దర్యాప్తు కీలకదశకు చేరింది. నిందితులకు నార్కో పరీక్షలు నిర్వహించేందుకు దర్యాప్తు బృందం ఏర్పాట్లు చేస్తోంది. 

Updated : 04 Dec 2022 10:29 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉత్తరాఖండ్‌లోని ఓ రిసార్టు రిసెప్షనిస్టు అంకితా భండారీ హత్యకేసులో నిందితులకు నార్కో పరీక్షలకు రంగం సిద్ధమవుతోంది.  ఈ కేసులో రిసార్టు యజమాని పులకిత్‌ ఆర్యాతోపాటు సౌరభ్‌ భాస్కర్‌, అంకిత్‌ గుప్తాపై ప్రధాన అభియోగాలు నమోదయ్యాయి. వీరికి నార్కో అనాలసిస్‌ పరీక్షలు నిర్వహించాలని ఇప్పటికే దర్యాప్తు బృందం కోర్టులో దరఖాస్తు చేసింది. కోర్టు నుంచి అనుమతి వచ్చిన వెంటనే పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నార్కో పరీక్షల అనంతరమే దర్యాప్తు బృందం కోర్టులో ఛార్జిషీట్‌ దాఖలు చేయనుంది.

రిషికేష్‌ సమీపంలో పులకిత్‌ ఆర్య నడుపుతున్న రిసార్టులో రిసెప్షనిస్టుగా పనిచేస్తున్న 19 ఏళ్ల అంకితా భండారీ సెప్టెంబర్‌ 18న అదృశ్యమైంది. కేసును తప్పుదోవ పట్టించడానికి పులకిత్‌ విశ్వప్రయత్నం చేశాడు. ఆమె మిత్రుడు ఫోన్‌ చేయగా.. తనకు ఏమి తెలియదని పులకిత్‌ తొలుత బుకాయించాడు. కానీ, పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వ్యభిచారం చేయడానికి నిరాకరించడంతో  అంకితాను హత్య చేసి రిషికేష్‌ సమీపంలోని చిల్లా కెనాల్‌లో పడేసినట్లు గుర్తించారు. ఈ కేసు వెలుగులోకి రావడంతో పులకిత్‌ తండ్రి వినోద్‌ ఆర్యాను భాజపా నుంచి తొలగించారు. ఆ రిసార్టును కూడా అధికారులు అక్రమ కట్టడంగా ప్రకటించి కూల్చివేశారు. సాక్ష్యాలను మాయం చేయడానికే ఇలా చేశారంటూ అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని