Gorantla madhav: మాధవ్‌ వీడియో ఒరిజినల్‌ కాదు.. అసలు వీడియో దొరికితేనే క్లారిటీ: అనంతపురం ఎస్పీ

హిందూపురం వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ నగ్న వీడియో వ్యవహారంపై ఎట్టకేలకు పోలీసులు స్పందించారు. కేసు వివరాలను బుధవారం అనంతపురం ఎస్పీ ఫకీరప్ప మీడియాకు వెల్లడించారు

Updated : 10 Aug 2022 18:31 IST

అనంతపురం: హిందూపురం వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ నగ్న వీడియో వ్యవహారంపై ఎట్టకేలకు పోలీసులు స్పందించారు. కేసు వివరాలను బుధవారం అనంతపురం ఎస్పీ ఫకీరప్ప మీడియాకు వెల్లడించారు.

‘‘వీడియో కాల్‌ వ్యవహారంపై ఎంపీ మాధవ్‌ అభిమాని కొణతాల వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనంతపురం టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఈనెల 4న కేసు నమోదు చేశాం. దర్యాప్తులో భాగంగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన వీడియో 3వ తేదీ అర్ధరాత్రి 2 గంటల సమయంలో యూకేలో రిజిస్టర్‌ అయిన వొడా ఫోన్‌ నెంబర్‌తో వీడియో అప్‌లోడ్‌ అయింది. ఐ-టీడీపీ వాట్సాప్‌ గ్రూప్‌లో మొదట ఈ వీడియోను పోస్టు చేశారు. సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన నెంబరు ఇంటర్నేషనల్‌ నెంబర్‌ కావడంతో దర్యాప్తు కొనసాగుతోంది. వొడా ఫోన్‌ నుంచి నిందితుడి వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నాం. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో ఒరిజినల్‌ కాదు. ఒకరు మొబైల్‌లో చూస్తున్నప్పుడు మరొకరు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. సోషల్‌ మీడియాలో ఈ వీడియోను చాలా సార్లు ఫార్వర్డ్‌, రీ పోస్టు చేయడం జరిగింది. ఐ -టీడీపీ వాట్సాప్‌ గ్రూప్‌లో తొలిసారి పోస్టు చేసింది కూడా ఫార్వర్డ్‌ చేసిన వీడియోనే. ఆ వీడియో ఒరిజినల్‌ కాదు కాబట్టీ, అది మార్ఫింగ్‌ చేశారా?లేదా అనేది నిర్ధారించలేకపోతున్నాం.

ఒరిజినల్‌ వీడియో దొరికే వరకు, తొలుత వీడియో పోస్టు చేసిన వ్యక్తి దొరికే వరకు ఇది నిర్ధారణ చేయలేము. ఒరిజినల్‌ వీడియో దొరికితేనే మార్ఫింగా , కాదా అనేది చెప్పలేం. సోషల్‌ మీడియాలో చూస్తున్న వీడియో ఒరిజినల్‌ కాదు. వీడియో అప్‌లోడ్‌ చేసిన వ్యక్తి వివరాలు సేకరిస్తున్నాం. ఈ వీడియోలో ఉన్నది తామేనని ఇప్పటి వరకు బాధితులు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. వీడియోలో ఉన్నది ఎంపీ మాధవా? కాదా? అన్నది కూడా చెప్పలేం. వీడియోను యూకేలో ఎడిటింగ్‌ చేసినట్టు తెలుస్తోంది. ఒరిజినల్‌ వీడియో ఎవరి వద్దైనా ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. వీడియో వ్యవహారంపై ఎంపీ స్వయంగా ఫిర్యాదు చేయలేదు. ప్రాథమిక దర్యాప్తు సమాచారం మాత్రమే చెబుతున్నాం. ఒరిజినల్‌ వీడియో ఉంటేనే ఫోరెన్సిక్‌ నివేదిక వస్తుంది’’ అని అనంతపురం ఎస్పీ ఫకీరప్ప తెలిపారు.

పరువునష్టం దావా వేస్తా: గోరంట్ల మాధవ్‌
వీడియో కాల్‌ వ్యవహారంపై అనంతపురం ఎస్పీ ఫకీరప్ప మీడియా సమావేశం తర్వాత  వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ స్పందించారు.  ‘‘నన్ను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకే ఇలాంటి పనులు చేస్తున్నారు. అది వందశాతం ఫేక్‌ వీడియో అని గతంలోనే చెప్పా. కడిగిన ముత్యంలా బయటకు వస్తానని నాకు ముందే తెలుసు. వీడియోను నేను పెద్దగా పట్టించుకోలేదు. వీడియో వచ్చిన తర్వాత కూడా నా పనులు నేను చేసుకున్నా. వీడియోపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటా. వీడియో సృష్టించిన వారిపై పరువునష్టం దావా వేస్తా. నాపైనే ఎందుకు వీడియో చేశారో దాన్ని సృష్టించిన వారినే అడగాలి. వీడియోపై నిజానిజాలు తేల్చాలని పోలీసులను కోరా’’ అని గోరంట్ల మాధవ్‌ తెలిపారు.


Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని