Telangana News: ఎమ్మెల్యేలకు ఎర కేసులో కొత్త ట్విస్ట్‌.. రామచంద్రభారతిపై మరో కేసు నమోదు

తెరాస ఎమ్మెల్యేల కొనుగోలుకు ఎర వ్యవహారంలో సిట్‌ దర్యాప్తు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈకేసులో కీలక నిందితుడిగా ఉన్న రామచంద్రభారతిపై బంజారాహిల్స్‌ పీఎస్‌లో ఇవాళ మరో కేసు నమోదైంది. 

Updated : 23 Nov 2022 18:43 IST

హైదరాబాద్‌: తెరాస ఎమ్మెల్యేల కొనుగోలుకు ఎర వ్యవహారంలో సిట్‌ దర్యాప్తు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈకేసులో కీలక నిందితుడిగా ఉన్న రామచంద్రభారతిపై బంజారాహిల్స్‌ పీఎస్‌లో ఇవాళ మరో కేసు నమోదైంది. రెండు పాస్‌పోర్టులు కలిగి ఉన్నాడని రాజేంద్రనగర్‌ ఏసీపీ, సిట్‌ సభ్యుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రామచంద్రభారతి ల్యాప్‌టాప్‌ను పరిశీలించినప్పుడు అందులో రెండు పాస్‌పోర్టులు ఉన్నట్టు సిట్‌ అధికారులు గుర్తించారు. రెండు వేర్వేరు నెంబర్లతో రామచంద్రభారతి పాస్‌పోర్టులు ఉన్నట్టు తేలింది. దీంతో ఏసీపీ ఫిర్యాదు చేశారు. ఆధార్‌, పాన్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌లు సైతం ఒక్కోటి 3 చొప్పున కలిగి ఉన్నాడని రామచంద్రభారతిపై ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గతంలోనే ఆయనపై ఒక కేసు నమోదైంది.

దర్యాప్తు పేరుతో వేధిస్తున్నారు: న్యాయవాది శ్రీనివాస్‌

సిట్ అధికారులు దర్యాప్తు పేరుతో వేధిస్తున్నారని న్యాయవాది శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణకు ఎప్పుడు పిలిచినా రావాలని సిట్ అధికారులు చెప్పారని.. దీనివల్ల ఇతర పనులేమీ చేసుకోలేకపోతున్నట్లు శ్రీనివాస్ తరఫు న్యాయవాది పొన్నం అశోక్ గౌడ్ కోర్టుకు తెలిపారు. దర్యాప్తుతో సంబంధంలేని విషయాలు అడుగుతున్నారని.. ఆదాయ పన్ను చెల్లింపునకు సంబంధించిన వివరాలు కూడా తీసుకురావాలని అడుగుతున్నట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రశ్నిస్తుండటం వల్ల శ్రీనివాస్ ఒత్తిడికి గురవుతున్నాడని ధర్మాసనానికి తెలిపారు. దర్యాప్తులో భాగంగా ఇప్పటికే రెండు రోజులపాటు సిట్ అధికారులు శ్రీనివాస్‌ను ప్రశ్నించారని.. మరోసారి ప్రశ్నించాల్సి ఉన్నందున పిలిచినప్పుడు రావాలని సిట్ అధికారులు శ్రీనివాస్‌కు చెప్పినట్లు అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోర్టుకు తెలిపారు. శ్రీనివాస్ తరఫు న్యాయవాది వాదనలు పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. ఈ నెల 25వ తేదీన సిట్ ఎదుట హాజరై అధికారులు ఇదివరకే అడిగిన సమాచారాన్ని రాతపూర్వకంగా ఇవ్వాలని ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని