Crime news: కోల్‌కతాలో మరో మోడల్‌ ఆత్మహత్య.. 15 రోజుల్లో నలుగురు!

పశ్చిమ బెంగాల్‌ చిత్రసీమలో వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. రెండువారాల వ్యవధిలోనే నలుగురు మోడల్స్‌ బలవన్మరణానికి పాల్పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది....

Updated : 21 Nov 2022 15:19 IST

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ చిత్రసీమలో వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. రెండువారాల వ్యవధిలోనే నలుగురు మోడల్స్‌ బలవన్మరణానికి పాల్పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజాగా సరస్వతి దాస్‌ (18) అనే మోడల్‌, మేకప్‌ ఆర్టిస్ట్‌ ఆదివారం ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. కస్బాలోని తన ఇంట్లోని గదిలో ఉరేసుకొని మృతిచెందినట్టు పేర్కొన్నారు. సరస్వతి దాస్‌ చిన్న చిన్న ఈవెంట్లు చేసుకొనే మేకప్‌ ఆర్టిస్ట్‌గా గుర్తించారు. అయితే, ఆమెది ఆత్మహత్యగానే కనబడుతున్నప్పటికీ.. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని పోలీసులు తెలిపారు.

తన తల్లి, అత్త బయటకు వెళ్లిన సమయంలో సరస్వతి గదిలో ఉరివేసుకోవడం ఆమె అమ్మమ్మ చూశారనీ.. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా ప్రాణాలు కోల్పోయిందని వివరించారు. ఆ సమయంలోనే పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారన్నారు. పోస్టుమార్టం నివేదిక కోసం తాము వేచి చూస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే, ఇటీవల ముగ్గురు మోడల్స్‌ ఆత్మహత్యలతో సరస్వతి ఉదంతానికి ఏమైనా లింక్‌ ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే సరస్వతి దాస్‌ ఫోన్‌ను సీజ్‌ చేసిన పోలీసులు.. ఆమె సామాజిక మాధ్యమ ఖాతాలు, ఫోన్‌ కాల్‌ డేటాను పరిశీలిస్తున్నారు.

ఇటీవల యువ నటి, మోడల్‌ మంజుషా నియోగి కోల్‌కతాలోని తన అపార్ట్‌మెంట్‌లో శుక్రవారం విగతజీవిగా కనిపించిన విషయం తెలిసిందే. మంజుషా స్నేహితురాలు, నటి బిదిషా మజుందార్‌ గత బుధవారం బలవన్మరణానికి పాల్పడగా.. స్నేహితురాలి మృతితో తీవ్ర కుంగుబాటుకు లోనై మంజుషా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే, ఈ నెల 15న మరో నటి పల్లవి డే కూడా ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. కేవలం 15 రోజుల వ్యవధిలోనే నలుగురు మోడల్స్‌ మృతిచెందడంతో పోలీసులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని