AP Politics: వైకాపాలో వర్గపోరు పార్టీ గ్రామాధ్యక్షుడి హత్య

వైకాపా నాయకుల మధ్య వర్గపోరుతో పార్టీ గ్రామాధ్యక్షుడు హత్యకు గురయిన ఘటన తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో శనివారం తీవ్ర ఉద్రిక్తతకు

Updated : 11 Aug 2022 14:34 IST

గోపాలపురం నియోజకవర్గం జి.కొత్తపల్లిలో ఘటన

పరామర్శకు వచ్చిన ఎమ్మెల్యే వెంకట్రావుపై గ్రామస్థుల మూకదాడి

ఈనాడు డిజిటల్‌ - ఏలూరు, న్యూస్‌టుడే- ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: వైకాపా నాయకుల మధ్య వర్గపోరుతో పార్టీ గ్రామాధ్యక్షుడు హత్యకు గురయిన ఘటన తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో శనివారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. హత్యకు గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావే కారణమంటూ.. పరామర్శించేందుకు వచ్చిన ఆయనపై గ్రామస్థులు పలుమార్లు మూకదాడి చేశారు.  దాదాపు మూడున్నర గంటల ఉద్రిక్తత తర్వాత పోలీసు ఉన్నతాధికారులు అతికష్టం మీద ఆయన్ను అక్కణ్నించి తీసుకెళ్లారు. ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో వైకాపా గ్రామ అధ్యక్షుడు గంజి నాగప్రసాద్‌ (55)ను శనివారం ఉదయం ముగ్గురు కత్తులతో దాడి చేసి దారుణంగా హతమార్చారు. స్థానికులు, పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు.. గంజి ప్రసాద్‌ ఉదయం ఏడున్నరకు పాల కోసం ఇంటి నుంచి ద్విచక్రవాహనంపై బయలుదేరారు. గ్రామ శివార్లలోని పాఠశాల వద్దకు రాగానే స్థానికులు మండవల్లి సురేశ్‌, ఉండ్రాజవరపు మోహన్‌కుమార్‌, శానం హేమంత్‌కుమార్‌లు ఆయన్ను కత్తితో విచక్షణారహితంగా నరికారు. దాడిలో ప్రసాద్‌ తల దాదాపు మొండెం నుంచి వేరవగా.. ఓ చేయి తెగిపడింది. దాడిలో ప్రసాద్‌ అక్కడికక్కడే చనిపోయారు. వెంటనే నిందితులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు.

గంజి ప్రసాద్‌కు మంచి నాయకుడనే పేరుండటంతో.. ఆయన హత్య వార్త వినగానే దాదాపు ఊరంతా అక్కడికి చేరింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా చాలా మంది వచ్చారు. స్థానిక పోలీసులూ ఘటనాస్థలికి చేరుకున్నారు. కాసేపటికి గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అక్కడికి వచ్చి మృతదేహాన్ని పరిశీలిస్తుండగా స్థానికులు.. ‘రారా రా. చూడు. నీ వల్లే మంచోణ్ని చంపేశార్రా. నువ్వు ఎమ్మెల్యేవారా’ అంటూ దుర్భాషలాడటం ప్రారంభించారు. ఎమ్మెల్యేపై వారు దాడి చేస్తారేమోనని పోలీసులు ఆయన్ను పక్కనున్న పాఠశాలలోకి తీసుకెళ్లబోతుండగా స్థానికులు ఆయనపై పిడిగుద్దులు కురిపించారు. ఈ క్రమంలో ఒకటి రెండుసార్లు ఎమ్మెల్యే కిందపడినా స్థానికులు ఆయనపై చేయిచేసుకోవడం ఆపలేదు. ఆయన్ను పాఠశాల గదిలో పెట్టి పోలీసులు, ఇతర గ్రామాల వైకాపా నాయకులు పహారా కాస్తున్నా స్థానికులు ఎమ్మెల్యే జుట్టుపట్టుకుని లాగారు. రాళ్లు రువ్వారు. ఉదయం 9 నుంచి మూడున్నర గంటలపాటు ఆ దాడిని నిలువరించేందుకు పోలీసులు నానా అవస్థలు పడ్డారు. ఎమ్మెల్యేపై విసిరిన రాయి తగిలి స్థానికుడి చేతికి, కర్రలతో దాడిలో ఓ కానిస్టేబుల్‌ తలకు గాయాలయ్యాయి. దాడిలో ఎమ్మెల్యే చొక్కా చిరిగిపోవడంతో స్థానికుడు ఒకరు టీషర్టు తెచ్చివ్వగా వేసుకున్నారు. టీషర్టు ఇచ్చిన వ్యక్తిపైనా గ్రామస్థులు దాడిచేసినట్లు తెలిసింది. పరిస్థితి చేయిదాటిపోతుండటంతో పోలీసులు అదనపు బలగాలను రప్పించారు. ఏలూరు రేంజి డీఐజీ పాలరాజు, ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ, వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెలికాని రాజబాబు స్థానికులకు పదేపదే నచ్చజెప్పి.. మధ్యాహ్నం 12.30 గంటలకు ఎమ్మెల్యేను అక్కడి నుంచి తప్పించి, వాహనం ఎక్కించి పంపేశారు. ఈ క్రమంలోనూ కొందరు ఆయనపై దాడి చేసేందుకు పొలం గట్లమ్మట పరిగెత్తారు. ‘నా భర్తను ఎమ్మెల్యే, ఎస్సై, వైకాపా ఎంపీటీసీ సభ్యుడు బజారయ్యలు కుమ్మక్కై చంపించారు. వెంటనే వారు రాజీనామా చేయాలి. నాకు న్యాయం చేసేవరకు ఇక్కణ్నించి వెళ్లను. చంపినవారిని మాకు అప్పగించేదాకా ఆయన మృతదేహాన్ని తీసుకెళ్లొద్దు’ అని ఘటనాస్థలిలో గంజి ప్రసాద్‌ భార్య సత్యవతి డిమాండ్‌ చేశారు.

ఆధిపత్య పోరే కారణమా?

స్థానిక ఎంపీటీసీ సభ్యుడు బిరుదుగడ్డ బజారయ్య, గంజి ప్రసాద్‌ ఇద్దరూ వైకాపా వారే. కొంతకాలంగా వీరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇళ్ల స్థలాల పంపిణీలో బజారయ్య అక్రమాలకు పాల్పడ్డార[ని, అతణ్ని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలంటూ ఇటీవల గ్రామస్థాయి సమావేశంలో గంజి ప్రసాద్‌ ఆరోపించారు. దీనిపై ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. ఇది మనసులో ఉంచుకునే బజారయ్య ఈ హత్య చేయించారని స్థానికులు అంటున్నారు. రెండు వర్గాల మధ్య గొడవలపై ప్రసాద్‌ పలుమార్లు ఎస్సైకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, ఆ నిర్లక్ష్యమే హత్యకు దారితీసిందని, బజారయ్య ఎమ్మెల్యే అనుచరుడు కావడంతో హత్యలో ఆయన పాత్ర కూడా ఉందని ఆరోపిస్తున్నారు. హత్య చేసి, లొంగిపోయిన ముగ్గురూ బజారయ్య అనుచరులేనని సమాచారం. వీరితోపాటు బజారయ్య కూడా తన తండ్రి హత్యకు కారణమంటూ మృతుడి కుమారుడు ఉదయ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఎవరున్నా వదిలిపెట్టబోం: డీఐజీ

‘గంజి ప్రసాద్‌ హత్యతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. పరామర్శించేందుకు వచ్చిన ఎమ్మెల్యేను ఆవేశంతో స్థానికులు అడ్డగించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఎమ్మెల్యేను క్షేమంగా వెనక్కి పంపించారు. హత్య విషయంలో ఇప్పటికే ముగ్గురు వ్యక్తులు లొంగిపోయారు. కొంతమంది పోలీసుల అలసత్వం కూడా దీనికి కారణమని గ్రామస్థులు చెబుతున్నారు. దీని వెనక ఎవరున్నా చర్యలు తీసుకుంటాం’ అని ఏలూరు రేంజ్‌ డీఐజీ పాలరాజు తెలిపారు.

తలారి వెంకట్రావే ప్రధాన నిందితుడు - మాజీ ఎమ్మెల్యే ముప్పిడి  

పోలవరం కాలువకు సంబంధించిన 50 ఎకరాల భూమిని ఎమ్మెల్యే తలారి వెంకట్రావు తన వర్గంవారికి కట్టబెట్టారని, అక్రమంగా మట్టి, గ్రావెల్‌ అమ్మకాలు మొదలుపెట్టారని తెదేపా గోపాలపురం నియోజకవర్గ బాధ్యుడు, మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఆరోపించారు. ఇలాంటి అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే సొంత పార్టీ నాయకుడు గంజి ప్రసాద్‌ను ఎమ్మెల్యేనే హత్య చేయించారన్నారు.


హత్యకు కారకులైనవారిని శిక్షించాలి: ఎమ్మెల్యే తలారి

దేవరపల్లి, న్యూస్‌టుడే: గంజి ప్రసాద్‌ హత్య చాలా దారుణమని, ఈ హత్యకు తనకెలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే తలారి వెంకట్రావు పేర్కొన్నారు. శనివారం క్యాంపు కార్యాలయంలో తూర్పుగోదావరి జిల్లా వైకాపా అధ్యక్షుడు జక్కంపూడి రాజాతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘ప్రసాద్‌ 2014 నుంచి నా వెంటే ఉంటూ పార్టీ కోసం కష్టపడ్డారు. కొంతకాలంగా ప్రసాద్‌, బజారయ్యలు రెండువర్గాలుగా విడిపోయి తరచూ గొడవలు పడుతున్నారు. కేసులు పెట్టుకుంటున్నారు. చాలాసార్లు సర్దిచెప్పినా వినలేదు. ఇటీవలే హెచ్చరించాను. ఇద్దరినీ సమన్వయపరచడానికి సమావేశం పెడదామని మండల నాయకులకు చెప్పాను. ఇంతలోనే ఈ దారుణం జరిగింది’ అని చెప్పారు. హత్య గురించి తెలియగానే జి.కొత్తపల్లి వెళ్లానన్నారు. కొందరు అపరిచిత వ్యక్తులు, తెదేపా నాయకులతో కలిసి తనపై దాడి చేశారని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని