Aryan Khan: ఆర్యన్‌ ఖాన్‌కి బెయిల్ నిరాకరణ

బాలీవుడ్‌ అగ్ర హీరో షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ఖాన్‌కు ముంబయి కోర్టులో చుక్కెదురైంది. క్రూజ్‌ నౌక డ్రగ్స్‌ కేసు వ్యవహారంలో అతడికి .....

Updated : 08 Oct 2021 18:23 IST

ముంబయి: బాలీవుడ్‌ అగ్ర హీరో షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ఖాన్‌కు ముంబయి కోర్టులో చుక్కెదురైంది. క్రూజ్‌ నౌక డ్రగ్స్‌ కేసు వ్యవహారంలో అతడికి బెయిల్‌ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. డ్రగ్స్‌ ఆరోపణలపై ఇటీవల అరెస్టయిన ఆర్యన్‌తో పాటు ఎనిమిది మందికి నిన్న న్యాయస్థానం 14 రోజుల పాటు జ్యుడీషియల్‌ కస్టడీ విధించిన విషయం తెలిసిందే. అయితే, ఆర్యన్‌ తరఫు న్యాయవాది నిన్న మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయగా.. ఈ రోజు నిర్ణయం తీసుకుంటానని న్యాయమూర్తి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం వాదనలు జరిగాయి. వాదనలు విన్న న్యాయమూర్తి ఆర్యన్‌తో పాటు అర్బాజ్‌ మెర్చంట్‌, మూన్‌మూన్‌ ధమేచలకు బెయిల్‌ తిరస్కరించారు. ఈ ముగ్గురూ బెయిల్‌ కోసం  సెషన్స్‌ కోర్టుకు వెళ్లొచ్చని సూచించారు. 

ఆర్యన్‌కు బెయిల్‌ ఇవ్వొద్దని ఎన్సీబీ తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ అనిల్‌ సింగ్‌ కోర్టును కోరారు. బెయిల్‌పై విడుదల చేస్తే దర్యాప్తుపై ప్రభావం పడుతుందన్నారు. సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం కూడా ఉందని వాదించారు.

మరోవైపు, అర్బాజ్‌ మెర్చంట్‌ న్యాయవాది బెయిల్‌ కోసం రేపు సెషన్స్‌ కోర్టులో పిటిషన్‌ వేయనున్నట్టు సమాచారం. బెయిల్‌ పిటిషన్‌పై వాదనల సందర్భంగా మూన్‌మూన్‌ ధమేచా న్యాయవాది మాట్లాడుతూ.. మూన్‌మన్‌ మధ్యప్రదేశ్‌కు చెందినవారని, ఆమెను ముంబయికి ఆహ్వానించడం వల్లే చాలా ఏళ్ల తర్వాత ఇక్కడికి వచ్చారని కోర్టుకు తెలిపారు. ఆమెకు వ్యతిరేకంగా ఎన్సీబీ వద్ద ఎలాంటి ఆధారాలూ లేవని వాదించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు