
Lakhimpur Kheri: ఆశిష్ మిశ్రాకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ!
పోలీసు రిమాండ్కు తరలించడంపై సోమవారం నిర్ణయం
ఉత్తరప్రదేశ్: లఖింపుర్ ఖేరి హింసాత్మక ఘటనలో నిందితుడిగా భావిస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు. శనివారం దాదాపు 12 గంటల విచారణ అనంతరం రాత్రి ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. నేడు(ఆదివారం) కోర్టులకు సెలవు కావడంతో రాత్రే జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు. అంతకుముందు ఆయనకు క్రైం బ్రాంచ్ కార్యాలయంలోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆశిష్ మిశ్రాను పోలీసుల రిమాండుకు అనుమతించాలని కోరుతూ న్యాయమూర్తికి దరఖాస్తు సమర్పించామని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎస్పీ యాదవ్ తెలిపారు. దీనిపై సోమవారం విచారణ జరగనుంది.
ఈ నెల 3న ఉత్తరప్రదేశ్లోని లఖింపుర్ ఖేరిలో సాగుచట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులపైకి కారు దూసుకెళ్లిన ఘటనలో నిందితుడిగా ఆశిష్ మిశ్రా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటనలో నలుగురు రైతులు మృతిచెందారు. అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలో మరో నలుగురు మృతిచెందారు. దీంతో ఈ ఘటన ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలనమైంది. రైతుల మృతిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసులో ఆశిష్ మిశ్రా పేరును పోలీసులు చేర్చారు. శనివారం క్రైం బ్రాంచ్ పోలీసుల ఎదుట ఆశిష్ హాజరయ్యారు. పోలీసులు ఆయనను 11 గంటల పాటు ప్రశ్నించారు. అనంతరం అరెస్ట్ చేశారు. విచారణలో ఆశిష్ మిశ్రా సహకరించలేదని పోలీసులు తెలిపారు.