Ashwaraopeta: అవమానాలు భరించలేకే!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్సై ఆత్మహత్య ఉదంతం కలకలం రేపింది. గతనెల 30న రాత్రి మహబూబాబాద్‌లో పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఎస్సై శ్రీరాముల శ్రీను చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి దాటాక మృతిచెందారు.

Updated : 08 Jul 2024 04:00 IST

ఆత్మహత్యకు యత్నించిన అశ్వారావుపేట ఎస్సై మృతి
మరణవార్త విని గుండెపోటుతో మేనత్త కన్నుమూత 
పై అధికారి, సిబ్బందిపై చేసిన ఆరోపణల వీడియో వైరల్‌ 

ఈనాడు, మహబూబాబాద్, ఈటీవీ-ఖమ్మం, అశ్వారావుపేట గ్రామీణం, న్యూస్‌టుడే: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్సై ఆత్మహత్య ఉదంతం కలకలం రేపింది. గతనెల 30న రాత్రి మహబూబాబాద్‌లో పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఎస్సై శ్రీరాముల శ్రీను చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి దాటాక మృతిచెందారు. తన భర్త మృతికి సీఐ జితేందర్‌రెడ్డి, కానిస్టేబుళ్లు శేఖర్, సన్యాసినాయుడు, సుభాని, శివనాగరాజులే కారణమని ఎస్సై భార్య కృష్ణవేణి హైదరాబాద్‌ మలక్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం.. చికిత్స పొందే సమయంలో శ్రీను తనకు ఎదురైన అనుభవాలను కుటుంబసభ్యులతో పంచుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడం చర్చనీయాంశమైంది. వారం కిందట ఆత్మహత్యకు యత్నించిన ఎస్సైను ప్రాథమిక చికిత్స అనంతరం వరంగల్‌ ఎంజీఎంకు.. అక్కణ్నుంచి హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. శ్రీను మరణవార్త తెలియగానే ఆయన మేనత్త, వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లికి రాజమ్మ గుండెపోటుతో కన్నుమూశారు. 

వరంగల్‌ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేటకు చెందిన శ్రీను 2014 బ్యాచ్‌కు చెందినవారు. ఈయనకు తొలి పోస్టింగ్‌ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దక్కింది. పలు స్టేషన్లలో విధులు నిర్వర్తించారు. ఆర్నెల్ల కిందట అశ్వారావుపేటకు బదిలీపై వచ్చారు. మరో ఏడాదిలో ఆయనకు సీఐగా పదోన్నతి లభించనున్న తరుణంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతుడికి భార్య, కుమార్తె (7), కుమారుడు (5) ఉన్నారు. అశ్వారావుపేట స్టేషన్‌ అధికారి (సీఐ), కానిస్టేబుళ్లు తనపట్ల అవమానకరంగా వ్యవహరించారని, కులం పేరుతో దూషించారని ఎస్సై శ్రీను తన వీడియో సంభాషణల్లో ఆవేదన వ్యక్తం చేశారు. 

వరంగల్‌ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేట జాతీయ రహదారిపై ధర్నా చేస్తున్న దళిత, గిరిజన సంఘాల నాయకులు, కుటుంబ సభ్యులు

‘వారంతా కావాలనే ఇబ్బంది పెట్టేవారు’

‘‘కానిస్టేబుళ్లు సన్యాసినాయుడు, శేఖర్, సుభాని, శివనాగరాజు, నాగలక్ష్మిలు కంప్యూటర్‌ వర్క్, రికార్డులు రాస్తుంటారు. రైటర్‌ విధులు నిర్వర్తిస్తుంటారు. నేను చెప్పే పనిని సరిగా చేసేవారు కాదు. ఇదేమిటని అడిగితే ఎదురుతిరిగేవారు. దీంతో వేరే కానిస్టేబుళ్లతో పనిచేయిస్తుంటే వారికీ అడ్డుతగిలే వారు. వీరికి ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌ శరత్‌ తోడయ్యారు. ఆయన సన్యాసినాయుడు, శేఖర్, శివనాగరాజులను స్టేషన్లో కలిసేవారు. శరత్‌ తన సోదరుడైన ఓ దినపత్రిక (ఈనాడు కాదు) విలేకరితో అసత్య కథనాలు రాయించేవారు. ఈ విషయాన్ని స్టేషన్‌ సీఐకి చెబితే నన్నే సూటిపోటి మాటలన్నారు. డీఎస్పీకి నివేదిక పంపినా స్పందన లేదు. జిల్లా ఎస్పీకీ 25 రోజుల కిందట (ఘటన జరిగే నాటికి) ఈ అంశాలపై రిపోర్టు ఇచ్చాను. ఆ తర్వాత ఏఎస్పీని కలిశాను. ఎస్పీ సెలవులో ఉన్నారు.. తిరిగొచ్చాక సమస్యను పరిష్కరిద్దామని ఆయన చెప్పారు. ఇదే సమయంలో ఇబ్బందులు ఎక్కువయ్యాయి. చిన్నచిన్న విషయాలకీ సీఐ మెమోలు ఇచ్చేవారు’’ అని శ్రీను వాపోయారు. ఈక్రమంలో వేరేచోటుకు బదిలీ చేయించుకునేందుకు ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధిని శ్రీను కలిసినట్లు సమాచారం. ఆ ప్రక్రియ కొంత ఆలస్యమైన క్రమంలో తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఐజీ కార్యాలయానికి సీఐ అటాచ్‌

ఎస్సై శ్రీను ఆత్మహత్యాయత్నం ఘటనపై మహబూబాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో 4 రోజుల కిందట ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఆయన భార్య కృష్ణవేణి ఈనెల 5న హైదరాబాద్‌ మలక్‌పేట స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అక్కడి పోలీసులు కేసును మహబాబూబాద్‌ ఠాణాకు బదలాయించారు. ఈ క్రమంలో ఉన్నతాధికారులు సీఐ జితేందర్‌రెడ్డిని ఐజీ కార్యాలయానికి, మిగతా నలుగురు కానిస్టేబుళ్లను భద్రాద్రి జిల్లా ఎస్పీకి అటాచ్‌ చేశారు. ఈ కేసుపై కొత్తగూడెం స్పెషల్‌ బ్రాంచి ఎస్‌బీ సీఐ నాగరాజు, ఏడూళ్లబయ్యారం సీఐ కరుణాకర్‌లు ప్రాథమిక విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు. ఎస్సై ఆత్మహత్యాయత్నం అనంతర పరిణామాలపై సీఐ జితేందర్‌రెడ్డి భార్య ఎం.శైలజ కూడా స్పందించారు. జరిగిన ఘటన తనను బాధించిందని రెండ్రోజుల క్రితం ఓ లేఖ, వీడియో సంభాషణను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. తన భర్త సామాజిక వర్గాన్ని ఉటంకిస్తూ ఆరోపణలు చేయొద్దని స్థానిక సంఘాలకు విజ్ఞప్తి చేశారు. దళిత సామాజిక వర్గానికి చెందిన తనను ఆయన పదేళ్ల కిందట వివాహమాడారని గుర్తుచేశారు. మరోవైపు ఎస్సై బలవన్మరణ ఘటనపై సమగ్ర దర్యాప్తు కోరుతూ అశ్వారావుపేటలో జాతీయ రహదారిపై దళిత సంఘాల నాయకులు పోలీస్‌స్టేషన్‌ ఎదుట ధర్నా చేశారు. నారక్కపేటలోనూ దళిత, గిరిజన సంఘాల నాయకులు, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘాల నాయకులు, బంధువులు శ్రీను మృతదేహాన్ని జాతీయ రహదారిపై ఉంచి ఆందోళన చేశారు. ఈక్రమంలో ఉద్రిక్త పరిస్థితుల నడుమ నారక్కపేటలో శ్రీను అంత్యక్రియలు ఆదివారం సాయంత్రం ముగిశాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని